Reading Time: 3 minutes

3 నుంచి సిఎం జిల్లాల పర్యటన షురూ

‘పుర’ పోరుకు మూడు పార్టీలు వ్యూహాలు

టికెట్‌ల కోసం ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ

ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు

బలమైన అభ్యర్థుల కోసం నివేదికలు సిద్ధం

అధిక స్థానాలను గెలిచేలా కాంగ్రెస్ వ్యూహాం..

అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చేలా బిఆర్‌ఎస్ ప్రణాళికలు

తమ స్థానాల్లో పట్టునిలుపుకునేలా బిజెపి సమాయత్తం

మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరిగాయి. పురపాలక సంఘాల ఎన్నికలు పార్టీల గుర్తుల మీద నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టికెట్ కోసం ఈ మూడు పార్టీల్లో పలువురు పోటీ పడుతుండడంతో ఈ మూడు ప్రధాన పార్టీల్లో అసమ్మతిసెగలు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీల అధి నాయకత్వాలు జిల్లా స్థాయి నేతలు, ఇన్‌చార్జీలకు సూచించినట్టుగా తెలిసింది.

మిర్యాలగూడ సభతో సిఎం శ్రీకారం

వచ్చేనెల 3వ తేదీన సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. అదేరోజు మిర్యాలగూడలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 04వ తేదీన జగిత్యాల, 5వ తేదీన చేవెళ్ల, 6వ తేదీన భూపాలపల్లి, 7వ తేదీన మెదక్, 8వ తేదీన నిజామాబాద్‌లో నిర్వహించే సభల్లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇక, బిఆర్‌ఎస్ నుంచి ముఖ్య నాయకులు, బిజెపి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడితో పాటు కేంద్రమంత్రులు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసి ఎన్నికల సభలో పాల్గొననున్నారు.

సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచారం వైపు

ఇక, తక్కువ సమయంలో ఓటర్లను చేరుకోవడానికి పార్టీలన్నీ సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచారం, వార్డు స్థాయి సమావేశాలపై ఎక్కువగా ఆధారపడనున్నాయి. ప్రస్తుతం యువత ఓటింగ్ శాతం పెరిగే అవకాశముండటంతో వారి సమస్యలు, అంశాలను కూడా అన్ని పార్టీలు ప్రధాన అంశాల్లో చేర్చినట్టుగా తెలిసింది. ప్రధానంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్‌ఎస్ అన్నట్టుగా సాగుతాయని రాజకీయ వర్గాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికార పార్టీ ఆశలు

అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీల్లో అత్యధిక స్థానాలను గెలిచిన విధంగానే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఉత్సాహాంగా ఉండగా అదే దూకుడుతో రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వారు సమాయత్తం అవుతున్నారు. గెలుపు బాధ్యతలను ముఖ్యంగా డిసిసి అధ్యక్షులపైనే కాంగ్రెస్ పార్టీ మోపింది. ఇప్పటికే జిల్లాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఎన్నికల తేదీని ప్రకటించడంతో అభ్యర్థుల గుర్తింపు దగ్గరి నుంచి అసమ్మతి నేతల బుజ్జగింపులను ఇన్‌చార్జీ మంత్రులు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ బాధ్యులను సమన్వయం చేసుకొని పార్టీ అభ్యర్థులు గెలిచేలా అవసరమైన కసరత్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిసిసిలకు ఆదేశాలు జారీచేసింది. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ కేడర్‌కు దిశానిర్ధేశం చేసింది. అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల సమాచారం తెలుసుకుంటుండడం విశేషం.

గెలుపు వ్యూహాలపై బిఆర్‌ఎస్ ఇన్‌చార్జీల పర్యవేక్షణ

ఇక, బిఆర్‌ఎస్ ముఖ్య నేతలైన కెటిఆర్, హరీశ్‌రావులు ఈ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు. పలువురు సీనియర్ నాయకులకు ఇన్‌చార్జీల బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాలని దానికోసం బిఆర్‌ఎస్ ఇన్‌చార్జీలు కృషి చేయాలని బిఆర్‌ఎస్ అధినాయకత్వం జిల్లాలోని కేడర్‌కు ఇన్‌చార్జీలకు సూచించినట్టుగా తెలిసింది. బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జీలకు బిఆర్‌ఎస్ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రమంత్రులు

బిజెపి పార్టీ సైతం అన్ని పురపాలికల్లో పోటీ చేసి మెజార్టీ కౌన్సిలర్లు గెలిపించేందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. దీని కోసం త్వరలోనే ఇన్‌చార్జీలను నియమించనుంది. కేంద్రమంత్రులు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలను రూపొందిస్తున్నారు.

ప్రభుత్వంపై ఉన్న అసమ్మతే అస్త్రంగా….

పట్టణాల్లో పెరిగిన జీవన వ్యయం, ఇంధన ధరలు, ఆస్తి పన్నులు, ట్రాఫిక్ సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన అంశాలను అస్త్రాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. రిజర్వేషన్ల ప్రక్రియలో కొన్ని చోట్ల అసమతుల్యత ఉందన్న ఆరోపణలు, వార్డు పునర్విభజనలో రాజకీయ లాభనష్టాల కోణం ఉందన్న విమర్శలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు తమ కేడర్‌కు సూచించినట్టుగా తెలిసింది.

నిర్లక్షం వద్దు

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్షం వద్దని కేడర్‌కు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి తమ నేతలకు దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. ఇక కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు జిల్లాల్లో మంచి పట్టు ఉండగా బిజెపికి మాత్రం పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉంది. దీంతో ఆయా పార్టీలు తాము ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నామో ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నట్టుగా తెలిసింది. ఇక, ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లాబీయింగ్ చేసిన వారికి టికెట్లు ఇస్తే ఎన్నికల్లో విజయావకాశాలు, మెజార్టీ సీట్లు కోల్పోయే చాన్స్ ఉందని ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తే గతంలో కంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రధాన పార్టీలు తమ కేడర్‌కు సూచించినట్టుగా సమాచారం.