
ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా సేవలు
బారామతితో ముడివడిన అజిత్ పవార్ అనుబంధం
ముంబై ః మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ కీలక వ్యక్తి అయిన అజిత్ పవార్ కింగ్‌మేకర్‌గానే వెళ్లిపోయారు. ఆయన ఎప్పుడూ పెళ్లి కొడుకు కాలేకపొయ్యారు. దగ్గరి వరకూ వచ్చిన తరువాత తోటి పెళ్లికొడుకు పాత్రకు పరిమితం కావల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు తెలిపారు. చింతించడం, చేజారిన అవకాశాలకు ఆయన మారుపేరుగా నిలిచారు. రికార్డు స్థాయిలో ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆరుసార్లు సేవలు అందించారు. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్ష నెరవేరకుండానే జీవితం ముగించాల్సి వచ్చింది. స్వస్థలం బారామతి ఆయనకు ఉజ్వల రాజకీయ వైభవం ప్రసాదించింది. చివరికి ఆయన ముగింపు కూడా బారామతి వద్దనే జరిగింది. 2023 లో బిజెపి, శివసేనల చీలిక వర్గం ప్రభుత్వంలో చేరడానికి ముందు ఆయన దేవెంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో కూడా డిప్యూటీ సిఎంగా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం కేవలం రెండు రోజులే అధికారంలో ఉంది.
శరద్ పవార్‌తో విభేదించి చీలిక వర్గం ఎన్‌సిపి నేతగా అజిత్ పవార్ ఎన్‌డిఎలో చేరి తిరిగి ఉప ముఖ్యమంత్రి కావల్సి వచ్చింది. కాంగ్రెస్, శివసేన, బిజెపి హయాంల్లో డిప్యూటి అయ్యారు రాజకీయాల్లో పెద్ద అన్నగా పిలవబడిన (దాదా) పవార్ ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకం అయి తిరిగారు. రూ 70 వేల కోట్ల స్కాం అప్పట్లో ఆయనను చుట్టుకుంది. తరువాతి దశలో కుమారుడు పార్థా పుణే భూ కుంభకోణం కూడా షాక్ ఇచ్చింది. అయితే ఇవేవీ ఆయన రాజకీయ చరిత్రను దెబ్బతీయలేకపోయాయి. 2023లో ఆయన శరద్ పవార్ నీడలో నుంచి బయటపడ్డాడు. తిరుగుబాటుకు దిగాడు.
పార్టీ ఎమ్మెల్యేలతో తన పేరిట వేరే గుర్తుతో ఎన్‌సిపిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దశలో ఆయన బిజెపి నుంచి ఎక్కువగా సాయం తీసుకున్నాడు. అయితే శరద్ పవార్ తన రాజకీయ గురువు అంతకు మించి అని, అయితే రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తప్పవని అజిత్ పవార్ చెపుతూ వచ్చారు. 1959 జులై 29న అజిత్ పవార్ ఆశా అనంత్‌రావు పవార్ దంపతులకు జన్మించారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. కేవలం శరద్ పవార్ మార్గదర్శకత్వంలోనే తన రాజకీయ జీవితం ఆరంభం అయిందని అజిత్ పవార్ తన విధేయతను చాటుకుంటూ వచ్చారు. కానీ ఆయనకే ఎదురుతిరిగారు. ఇది అత్యధిక మరాఠాలకు నచ్చలేదు.
ప్రమాదమే .. రాజకీయం చేయవద్దు: శరద్ పవార్
బుధవారం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందిన ఘటనపై సీనియర్ నేత శరద్ పవార్ సాయంత్రం స్పందించారు. ఇది ప్రమాదమే, దయచేసి దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దు అని బారామతి నుంచి ముంబైకి తిరిగి వచ్చిన దశలో మీడియాకు ప్రకటన వెలువరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రకటన వెలువరించారు. దీనికి ప్రతిగానే శరద్ పవార్ స్పందించినట్లు వెల్లడైంది. మహారాష్ట్ర ఓ సమర్థవంతమైన నేతను కోల్పోయింది. కొన్ని అంశాలు మన చేతుల్లో లేనివి కూడా ఉంటాయి.ఎవరూ దీనిపై రాజకీయ అనుమానాలు వ్యక్తం చేయరాదని శరద్ పవార్ కోరారు.