
కన్నెపల్లి నుంచి గద్దెపైకి చేరిన సారలమ్మ
మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం
గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు
నేడు గద్దెపైకి చేరనున్న సమ్మక్క
విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మేడారం
మన తెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంబరాన్నంటేలా వనదేవతల సంబురం ఆరంభమైంది. మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిరోజైన బుధవారం రాత్రి కన్నెపల్లినుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. ఈ ఘట్టంతో నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే మహా జాతరకు అంకురార్పణ జరిగింది. మరోవైపు కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగరం మండలం కొండాయినుంచి గోవిందరాజు కూడా బుధవారంమే గద్దెలపైకి చేరారు. జాతరలోని నలుగురిలో ముగ్గురు ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు. దేవతల రాకతో భక్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. రెండవరోజైన గురువారం జాతరలో ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్నారు.
తొలిరోజు కన్నెపల్లి వద్దనున్న సారలమ్మ గుడివద్ద మేడారంలోని కాక వంశీయులైన ఆదివాసీ పూజారులు తమ సంప్రదాయాలతో పూజా విధానం నిర్వహించారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాలతో కోలాహలం మధ్య అమ్మవారిని గుడినుంచి జంపన్న వాగు మీదుగా గద్దెల ప్రాంగణానికి తరలించారు. దారిపొడవునా గ్రామానికి చెందిన మహిళలు బిందెలతో నీళ్లు పోసి మంగళహారతులతో స్వాగతించారు. కన్నెపల్లి నుంచి మేడారంలోని గద్దెపైకి సారలమ్మను తీసుకువస్తున్న దారిలో తమ కోరికలు తీర్చాలని వేడుకుంటూ భక్తులు అమ్మవారికి పొర్లు దండాలు చేశారు. పూజారులను తాకేందుకు భక్తులు ఉత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దారిపొడవునా సారలమ్మ ఆశీస్సుల కోసం జనం బారులు తీరారు.
వనదేవతలను దర్శించుకునేందుకు ఇప్పటికే లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో మేడారం అటవీ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఎక్కడ చోటు దొరికితే అక్కడే భక్తులు గుడారాలు వేసుకుని వనదేవతల దర్శనానికి వేచిచూస్తున్నారు. భక్తుల నుంచి ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని పూజారులకు పోలీసులు రోప్ పార్టీతో గట్టి బందోబస్త్ ఏర్పాటుచేశారు. శివసత్తుల పూనకాలు…కొమ్ము బూర నాదాలుశివసత్తుల పూనకాలతో మేడారం ఊగిపోతున్నది. చాలాచోట్ల భక్తులు శివాలూగుతున్నారు. దేవుడిని చెబుతున్నారు. కొమ్ము బూర నాదాల మధ్య ఆధ్యాత్మిక భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.
భక్తి గీతాలతో మేడారం అంతా మార్మోగిపోతోంది. కొందరైతే కుటుంబంతో కలిసి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి డప్పు చప్పుళ్ళతో కాలినడకన అమ్మవార్ల గద్దెలకు వస్తున్నారు. వనదేవతలకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. రెండు కోట్లకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈసారి సరికొత్తగా మేడారం జాతర కనిపిస్తున్నదని భక్తులు చెబుతున్నారు.
జాతరకు మంత్రి సురేఖ డుమ్మా
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతరకు మంత్రి కొండా సురేఖ డుమ్మాకొట్టారు. దేవాదాయ మంత్రి హోదాలో అన్నీ తానై పనిచేయాల్సిన కొండా సురేఖ దూరంగా ఉండడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత జిల్లాలో జరిగే మహా జాతరలో మంత్రి సురేఖ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవానికితోడు మంత్రిగా పనిచేసినప్పటికీ.. రాజకీయంగా పొసగక పోవడంవల్లనే దూరంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. మంత్రి కొండా సురేఖకు తొలినుంచి మేడారం మహా జాతర విషయంలో విబేధాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జాతరలో కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క పూర్తిగా జాతరపై పట్టు పెంచుకోవడంతో మరో మంత్రి కొండా సురేఖతో గ్యాప్ పెరిగిందని రాజకీయంగా జోరుగా చర్చ జరిగింది.
దేవాదాయ మంత్రి హోదాలో మేడారం జాతరలో తొలిసారి చేసే ప్రయత్నాలకు చెక్ పడడంతో సురేఖ కిమ్మనకుండా ఉన్నట్టు ప్రచారం సాగింది. అయితే ఈసారి జాతర నిర్వహణలో మరోసారి మంత్రులమధ్య విబేధాలు తలెత్తి.. తారాస్థాయికి చేరుకున్నాయి. ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి అస్త్రంగా మంత్రి సురేఖ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. జాతరలో ప్రభుత్వపరంగా చేపట్టే పనులు తనకు తెలియకుండా జరుగుతున్నాయని మంత్రి సురేఖ ఆరోపించడంతో వివాదం చెలరేగింది. దాదాపు 250 కోట్లతో మేడారంలో చేపట్టిన పనుల పర్యవేక్షణ కూడా చేయలేదు. ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి చేపట్టిన సమీక్షకు కూడా మంత్రి సురేఖ గైర్హాజరయ్యారు. చిలికి చిలికి గాలివానలా మారిన వివాదం ప్రభుత్వపెద్దల జోక్యంతో సద్దుమణిగింది. తర్వాత్ జరిగిన సమీక్షలకు మొక్కుబడిగా మంత్రి సురేఖ హాజరయ్యారు.
ఇకనుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర నిర్వహణ ఉంటుందని భావించినప్పటికీ.. మంత్రి సురేఖ మాత్రం మేడారంవైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే మహా జాతర బుధవారంనుంచి ప్రారంభమైంది. ఈ సమయంలోనైనా జాతరలో ఉంటుందని ఊహించినప్పటికీ మంత్రి సురేఖ జాడ లేకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. సుమారు 3కోట్ల భక్తులు దర్శించుకునే సమ్మక్క, సారలమ్మ జాతరను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తుండగా జాతరను పర్యవేక్షించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి జాడ లేకపోవడం పలు సందేహాలకు తావిస్తున్నది. గత మూడు నెలలుగా జాతర కోసం అక్కడే తిష్ట వేసి మంత్రి సీతక్క పనులు చేస్తున్నది. అయితే ఆమెతో వైరం పెంచుకోవడం ఇష్టం లేకనే మంత్రి సురేఖ దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిన మేడారం జాతర సమయంలో దేవాదాయ శాఖ మంత్రి హోదాలో సురేఖ ఉంటే బాగుండేదని చర్చించుకొంటున్నారు