Reading Time: < 1 minute

పార్టీ నేతలకు అమెరికా నుంచి సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదే: పిసిసి చీఫ్

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, గెలిపించుకునే బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇదిలాఉండగా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు.

నామినేషన్ల దాఖలుకు రెండే రోజులు ఉన్నందున అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఇదివరకే లోక్‌సభ వారీగా నియమించిన ఇన్‌ఛార్జి మంత్రులు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. పోటీ చేసేందుకు ఆశావాహుల్ సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లా పార్టీ ముఖ్యులతో, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికకు వడపోసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి పేరు ఉన్న నాయకులను, ఇంకా బలమైన నాయకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఏకాభిప్రాయం కుదర్చకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే తిరుగుబాటు తలనొప్పులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలపై వార్ రూంలో చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

సహపంక్తి భోజనం కార్యక్రమం కుదింపు

బుధవారం నుంచి శనివారం (31) వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామ పథకం కూలీలతో కలిసి సహపంక్తి భోజనం చేయాలనుకున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన కార్యక్రమాన్ని కుదించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ కార్యక్రమాన్ని కుదించుకుని, బుధవారం మెదక్ జిల్లా, మానుకొండూలో గ్రామ సభలో మాత్రమే పాల్గొన్నారు.