Reading Time: < 1 minute

బ్రూవరీలకు బిఆర్‌ఎస్ హయాంలోని నిబంధనలే అమలు

మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అడ్డగోలు ఆరోపణలు: మంత్రి జూపల్లి

మన తెలంగాణ/హైదరాబాద్ : బ్రూవరీలకు అనుమతులకు బిఆర్‌ఎస్ హాయాంలో ఉన్న నిబంధనలే ఉన్నాయని, బిఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన రవీంధ్ర భారతిలో మీడియాతో మాట్లాడుతూ బ్రీవరీలకు సంబంధించి రెండేళ్లలో ఎటువంటి కొత్త చట్టం తీసుకురాలేదని 2015 ఆగస్ట్‌లో జారీ చేసిన జీఓ నెంబర్ 151 ద్వారానే నిబంధలు ఉన్నాయన్నారు. ఆ జీఓ ప్రకారమే 2016లో 20 కంపెనీలకు అనుమతిచ్చారని, 50 దరఖాస్తులు వస్తే ఎటువంటి లాటరీ విధానం పాటించకుండా 20 దరఖాస్తులకు అనుమతిచ్చినట్లు చెప్పారు. మైక్రో బ్రీవరీలకు సంబంధించి అనుమతుల కోసం తన వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదని, సంబంధిత శాఖకు మాత్రమే వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు.

కొత్త బ్రీవరీలకు దరఖాస్తులు వస్తే- ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే- అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గత బిఆర్‌ఎస్ హయాంలో 105 ఎలైట్ బార్లకు అనుమతి ఇచ్చారని, లాటరీ లేకుండా నచ్చిన వారికి అనుమతులు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ప్రతి 15 రోజులకు బకాయిలు చెల్లిస్తే బిఆర్‌ఎస్ హయాంలో ఎక్సైజ్ శాఖలో రూ. 3,500 కోట్లు ఎలా బకాయిలు పడ్డాయని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది బిఆర్‌ఎస్ అని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ ఆదాయం రూ. 10, 012 కోట్లు మాత్రమేనని, 2014 నుండి 2023 వరకు ఎక్సైజ్ ఆదాయాన్ని రూ. 34,869 కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. సింగూర్ జలాలను బీర్ల కంపెనీలకు తరలిస్తున్నారని, క్రాప్ హలిడే ప్రకటించారని విమర్శలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కంపెనీకి అనుమతి ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు.