Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణను వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇడి అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఛార్జిషీటును పరిగణలోకి తీసుకుని పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, నయీం తన గ్యాంగ్‌తో సంపాదించిన సుమారు రూ.11.30 కోట్ల విలువైన 91 ఆస్తులను గుర్తించిన ఇడి పాశం శ్రీనివాస్, హసీనా బేగం, మహమ్మద్ తాహెరా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీమ్, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దౌస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్,హీనా కౌసర్ అనే పది మందిపై అభియోగాలు మోపింది.

ఆస్తులు బలవంతంగా బాధితులను బెదిరించి రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు. కేసులో నయీం భార్య హసీనా బేగంతో పాటు పలువురు కుటుంబ సభ్యుల పేర్లను ఇడి తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.