
పదేళ్ల పాలనలో 25 కోట్లమందికి పేదరికం నుంచి విముక్తి
పేదలకు 4 కోట్ల పక్కాఇళ్లు
వందకోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు
95కోట్ల మందికి సామాజిక భద్రత
ఆయుష్మాన్ భారత్ కింద 11 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు
పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం, భద్రత కల్పించేందుకే తమ ప్రభు త్వం నిరంతరం కృషిచేస్తున్నదని బుధవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ( అందరితో అభివృద్ధి, అందరికీ అనే దృక్పథం తో అన్నివర్గాల ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడినవర్గాలు, అణగారిన, గిరిజన వర్గాల కోసం కృషిచేస్తున్నదన్నారు.
2014 ప్రారంభంలో, సామాజిక భద్రతా పథకాలు కేవలం 25 కోట్ల మంది పౌరులకే చేరువయ్యాయని,తమ ప్రభుత్వం నిరంతర కృషి వల్ల, నేడు దాదాపు 95 కోట్ల మంది భారతీయులకు సామాజిక భద్రత కల్పించబడిందని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధత వల్లనే గత దశాబ్దంలో 25 కోట్ల మంది పౌరులు పేదరికాన్ని అధిగమించారని ముర్ము చెప్పారు.గత పదేళ్ల కాలంలో పేదలకోసం నాలుగు కోట్ల పక్కాఇళ్లు నిర్మించామని చెప్పారు.గత ఏడాదిలోనే 32 లక్షల కొత్త ఇళ్లను పేదలకు కల్పించిన విషయాన్ని వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కింద గత ఏడాది 11 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందాయని, ఆస్పత్రులలో చేరిన రెండున్నర కోట్ల మందికి ఉచిత చికిత్స లభించిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, దేశవ్యాప్తంగా 1.80 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లు పనిచేస్తున్నాయని ముర్ము వివరించారు. జాతీయ అనీమియా నివారణ మిషన్ కింద 6.5 కోట్ల మంది మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని వారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధిని గుర్తించడంతో సమర్థవంతంగా నివారణ సాధ్యమవుతున్నదన్నారు.
భారత సైనిక దళాల పాటవం గర్వకారణం
భారత సైనిక దళాలు ఆపరేషన్ సిందూర్ , తర్వాత జరిగిన ఘర్షణలో చూపిన ధైర్యసాహసాలు దేశానికే గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. టెర్రరిస్ట్ శిబిరాలను నేలమట్టం చేయడం ద్వారా ప్రపంచానికి భారత సైనిక సత్తా చాటారన్నారు. జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మిషన్ సుదర్శన్ చక్ర పై దేశం కృషిచేస్తున్నదని రాష్ట్రపతి తెలిపారు. మావోయిస్ట్ ఉగ్రవాదం పై భద్రతా దళాలు నిర్ణయాత్మక చర్య తీసుకున్నాయని ప్రశంసించారు.