
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఈ నెల 30న విచారణకు హాజరుకావాల్సిందిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటిసు జారీ చేశారు. పిటిషనర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటిసు జారీ చేశారు. అదే రోజున విచారణకు హాజరుకావాల్సిందిగా నోటిసులో పేర్కొన్నారు. ఇదిలాఉండగా నోటీసు రావడంతోనే వెంటనే స్పందించిన దానం నాగేందర్ తాను పార్టీ ఫిరాయించలేదంటూ స్పీకర్‌కు అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.
పూర్వపరాల్లోకి వెళితే తమ పార్టీ నుంచి ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని బిఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని, వారు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలేనని నిర్థారిస్తూ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఇంకా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు అక్టోబర్‌లో స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో స్పీకర్ సుప్రీం తీర్పును అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డారని దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌పై ఈ నెల 19న సుప్రీం కోర్టు విచారణకు చేపట్టింది. స్పీకర్ అసెంబ్లీ సమావేశాల్లో బిజిగా ఉన్నందున, కామన్‌వెల్త్ పార్లమెంటు సమావేశాలకు హాజరైనందున సమయం సరిపోలేదని, దీంతో మరో నాలుగు వారాల గడువు కావాలని కోరడంతో సుప్రీం కోర్టు అందకు అంగీకరించినా, మీకు ఇదే చివరి అవకాశం అని హెచ్చరిక చేసింది.. దీంతో స్పీకర్ మిగతా ముగ్గురి విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే దానంకు నోటీసు పంపించారు. ఇంకా కె. సంజయ్, కడియం శ్రీహరి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలాఉండగా దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది.
–++–