
‘సింగరేణి‘ వ్యవహారంలో ప్రతిపక్షాలపై డిప్యూటీ సిఎం భట్టి మండిపాటు
మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : సింగరేణిలో టెండర్లకు సంబంధించి పూర్తి ఆధారాలతో స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ వివరించానని, అయినప్పటికి ప్రతిపక్షాలు అందులోనే తిరుగుతానంటే ఇక వాళ్ళ కర్మకే వదిలివేస్తున్నానని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిపై వస్తున్న ఆరోపణలపై మొన్న ప్రజాభవనంలో అన్ని సాక్షాధారాలతో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశానని, ఎవ్వరైనా తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశిస్తానని చెప్పినా… తనకు ఇప్పటి వరకు ఫిర్యాదు ఇవ్వకుండా రాద్దాంతం చేయడం సరికాదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దేశంలో లేరు కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సి ఎం తనకు కొన్ని సూచనలు చేశారని,మంత్రులు ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎదురైన సమస్యలను తనతో పంచుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజాభవన్లో కొందరు మంత్రులతో తాను సమావేశం అయ్యానే తప్పా ఇతరాత్ర కారణాలు ఏమి లేవని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
మున్సిపాల్టీల్లో కూడా మాదే గెలుపు
సర్పంచ్ ఎన్నికల్లో ఈ విధంగా అయితే అత్యధిక స్థానాలు గెలుపొందేమో మున్సిపాలిటీలో సైతం అదే విధంగా పెద్ద సంఖ్యలో స్థానాలు గెలుచుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని భట్టి విక్రమార్క మల్లు పేర్కోన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీల ఎన్నికలకు తెరలేచిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, పట్టణ ఇన్చార్జులు అంతా సమిష్టిగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థులు, కాంగ్రెస్ భావజాలం తెలిసిన, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలిగే వారిని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు.