
కాంగ్రెస్ 382, బిఆర్‌ఎస్ 258, బిజెపి నుంచి 169 దాఖలు
ఈనెల 30వ తేదీన నామినేషన్‌ల దాఖలుకు చివరిగడువు
మనతెలంగాణ/హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటిరోజు నామినేషన్‌లు వేయడానికి ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలోనే మొదటిరోజు (బుధవారం) నామినేషన్‌ల పర్వం భారీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్‌లు రాగా, బిఆర్‌ఎస్ నుంచి, బిజెపిల నుంచి నామమాత్రంగా నామినేషన్‌లు దాఖలు కావడంతో మొత్తంగా 902 నామినేషన్‌లు దాఖలయ్యాయి.
మంగళవారం ఎన్నికల కమిషనర్ మున్సిపల్ షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్‌లకు చివరిగడువుగా పేర్కొన్నారు. దీంతో మొదటిరోజు వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్‌లను దాఖలు చేయడానికి ఆసక్తి చూపారు. ఇంకా రెండు రోజులే నామినేషన్‌లకు గడువు ఉండడంతో నేడు, రేపు నామినేషన్‌లు భారీగా దాఖలవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
123 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఎన్నికలు
123 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఎన్నికలు జరుగనుండగా మొదటిరోజు 890 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 902 నామినేషన్‌లను దాఖలు చేశారు. ఆప్ నుంచి (1), బిఎస్పీ నుంచి (7), బిజెపి నుంచి (169), సిపిఐ నుంచి (08), కాంగ్రెస్ నుంచి (382), ఐఏఎంఐఎం నుంచి (03), బిఆర్‌ఎస్ నుంచి (258), టిడిపి నుంచి (0), వైఎస్‌ఆర్ సిపి నుంచి (0), ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి (19), స్వతంత్ర అభ్యర్థుల నుంచి (55) నామినేషన్‌లు కలిపి మొత్తంగా 902 నామినేషన్‌లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.
నో- డ్యూ సర్టిఫికెట్‌కు రూ.3 నుంచి రూ.5వేలు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నో- డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అన్న నిబంధనను విధించడంతో ప్రస్తుతం దానికోసం అభ్యర్థులు నానాతంటాలు పడుతున్నారు. ఈ సర్టిఫికెట్ కోసం అధికారులు సుమారుగా రూ.3 నుంచి రూ.5 వేలు వసూళ్లు చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత పురపాలకల్లో ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలను పెండింగ్ లేకుండా చెల్లిస్తేనే ఈ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు బకాయిలను చెల్లించడానికి పురపాలికల వద్ద క్యూ కడుతున్నారు. గతంలో నెలల తరబడి బకాయిలు చెల్లించని వారు ఒక్కసారిగా మొత్తం చెల్లించేందుకు ముందుకు వస్తుండడంతో పురపాలిక అధికారులు దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.