Reading Time: 2 minutes

రూ.100 కోట్లతో ఆధునిక పరికరాలు

రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం

క్షేత్రస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు

రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్థ (డిజాస్టర్ మేనేజిమెంట్) విభాగాన్ని బలోపేతం చేసి దేశానికి ఒక రోల్ మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా వంద కోట్ల రూపాయిలతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విపత్తుల నిర్వహణా విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాలతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరికరాలను కొనుగోలు చేయాలన్న విషయమై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించడానికి కచ్చితమైన సమాచార వ్యవస్థ, రియల్టైమ్ మానిటరింగ్ సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లను సాంకేతికతను రెవెన్యూ- విపత్తు నిర్వహణ విభాగాలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.

విపత్తు విభాగంలో పనిచేసే వారికి శిక్షణ

విపత్తు విభాగంలో పనిచేసే వారికి శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే వాతావరణ పరిస్థితులు క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా ఆయా స్థానిక పరిస్థితులను బట్టి మండలస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. భారీ వర్షాలు వరదల సమయంలో వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎయిర్లిఫ్ట్ మెకానిజం తయారు చేసుకోవాలని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి 70 నుంచి 80 కిలోల బరువును ఎత్తే డ్రోన్‌లను కొనుగోలు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు.

77 హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేయాలి

ఎయిర్ లిఫ్ట్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల 2024 సంవత్సరంలో తన పాలేరు నియోజవకర్గంలో వాగుల్లో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయానని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడడానికి వీలుగా సిమ్ ఆధారిత విహెచ్ ఎఫ్ రేడియో సిస్టమ్స్ అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికే ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఈ వ్యవస్థను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు.

అలాగే హైదరాబాద్‌లో హైరేజ్డ్ భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు. 77 హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని, ఒక్కో బృందంలో వెయ్యిమంది వరకు ఉన్నారని వారికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, ఐసిసిసి డైరెక్టర్ కమల్హాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి ఆరా

మేడారం మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి భక్తుల కొంగు బంగారం, తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో అత్యంత పవిత్రమైన మొదటి ఘట్టం బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో సచివాలయం నుంచి హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీతో మేడారంలో ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తున్న సిబ్బందితో మంత్రి పొంగులేటి మాట్లాడారు.

తొలిరోజు కావడంతో భక్తుల సంఖ్య, సారలమ్మ వార్ల రాక ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, జాతరలో నెలకొన్న పరిస్థితులు గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరీక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.