Reading Time: < 1 minute

రాష్ట్ర హైకోర్టు సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీకి షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల్లో రూ. 59.65 కోట్లు మూడు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గీతం యునివర్శిటిపై ఎస్‌పిడిసిఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. యూనివర్శిటీ చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో సగం చెల్లించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, గీతం యునివర్శిటీకి చెందిన విద్యుత్ బకాయిలు రూ. 118.13 కోట్ల రూపాయలు చెల్లించడంలేదంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో ఎస్‌పిడిసిఎల్ నోటీసులు జారీ చేసింది.

దీనిపై యునివర్శిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మాదవి దేవి గీతం యూనివర్శిటీకి విద్యుత్ కనెక్షన్ పునరుద్దరించాలని ఎస్‌పిడిసిఎల్‌ను ఆదేశించింది. దీనిపై ఎస్‌పిడిసిఎల్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించడానికి ముందస్తు షరతుగా మూడు వారాల్లోగా మొత్తం విద్యుత్ బకాయిలలో సగం విద్యుత్ సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది.