Reading Time: 3 minutes

మానవదేహ సౌందర్యము, సౌష్టవము, సర్వాంగ సంచలన సౌకుమార్యము నాట్యము నందే వ్యక్తమవుతుంది. సంగీతానికి, కవిత్వానికి మానవుడు తన గొంతుకను ఉపయోగిస్తే, నాట్యానికి తన పూర్తి శరీరాన్ని ఉపయోగిస్తున్నాడు. అత్యద్భుతమైన ఈ మానవ శరీరము కదలిక, లాలిత్యము చెట్ల కొమ్మల కదలికకు, సెలయేటి వంకలకు, తెలిమబ్బుల నడక కు చక్కగా సరిపోతుంది. నాట్యం ద్వారా వ్యక్తం చేసే భావము కవిత్వము అయితే, నాట్యమునకు వేయవల్సిన వేషధారణ, శిల్పము, చిత్రలేఖనము, నాట్యము చేసే రంగస్థల నిర్మాణము వాస్తు శాస్త్ర పూరితము. కాబట్టే విష్ణు ధర్మోత్తరకారుడు ఒక కళకు, మరొ క కళకు మైత్రి వున్నదని వ్యక్తపరిచాడు. శిల్పము నేర్చుకొనే వారు నాట్యము కూడా నేర్చుకోవాలి.

అలాగే శిల్ప శాస్త్రమును తెలుసుకోగలిగినవారు నాట్య శాస్త్రము పై కూడా అవగాహనను కలిగి ఉండాలి అని ధర్మశాస్త్రములు భోదిస్తున్నాయి. నాట్యంలో ఆంధ్రులు అతి పురాతనకాలం నుండి ప్రసిద్ధికెక్కిన వారని మన ప్రాచీన శిల్పాలలో గోచరిస్తున్నది. భరత శాస్త్రాన్ని పూర్తిగా అనుసరించి భారత దేశం అంతటా ఒకే రీతిని అనుసరిస్తూ, అభివృద్ధి చెందిన సాంప్రదాయ నాట్యరీతిని ‘మార్గీ’ అనీ, దేశంలోని ఆయా ప్రాంతాలను అనుసరించి భరతశాస్త్ర ఆధారంతో అభివృద్ధి చెందిన నాట్య సాంప్రదాయాన్ని ‘దేశీ’ అని అంటారు. నందికేశ్వరునిచే రచింపబడిన ‘అభినయ దర్పణము’ పూర్తిగా తెలుగువారికి చెందిన వారసత్వ రచన.

యక్షులు, నాగాసులు, కూర్మాపులు, భోగాలు, సానులు అనే అయిదు గంధర్వ తెగల వారు తెలుగుదేశములో అనాది నుండి గంధర్వ విద్యలను ఆరాధిస్తూ వస్తున్నారు. వీరి నృత్య కళ రెండు విధానాలుగా రూపొందుచూ వచ్చింది. మొదటిది నట్టువ మేళ సాంప్రదాయం, రెండవది నాట్య మేళ సంప్రదాయం. స్త్రీలు చేసే నాట్యాన్ని నట్టువమేళం అనీ, వీరు ప్రదర్శించే నాట్యాన్ని లాస్యం అని అంటారు. పురుషులు చేసే నృత్యాన్ని అలాగే నాటకాలను నాట్య మేళం అని దీనిని తాండవంగా వ్యవహరించారు. మృదంగ జతులు లేక వివిధ రాగాల స్వరాలకు హస్తాలు, పాదాలను క్రమపద్ధతిలో కదలిస్తూ ఆడటం ‘నృత్తం’, ఒక పాటలోని అర్థాన్ని హస్తాలతో వివరిస్తూ క్రమపద్ధతిలో ఆడటం ‘నృత్యం’, ఏదయినా కథలోని పాత్రలను అనుసరించి పాడుతూ, నృత్త, నృత్య అభినయాలను ప్రదర్శి స్తూ ఆడటం ‘నాట్యం’. స్త్రీలు ప్రదర్శించే సుకుమార నృత్యం లేక నర్తనం ‘లాస్యం’, పురుషులు ప్రదర్శించే ఉదృతమైన నృత్యం ‘తాండవం’, అని అంటారు.

మన ప్రాంత మొదటి చారిత్రక పాలకులైన శాతవాహనుల కాలంలో ప్రజలు సంగీత, నృత్య వినోదాలతో సుఖశాంతులు అనుభవించా రు. ఆనాటి కాలంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉండేది. సంగీత సభలలో, నాట్యమండలిలో ప్రవేశం ఉండేది. చాళుక్యుల కాలం నాటి ఆలయ శిల్పాలలో నటరాజ ప్రతిమ నాట్యానికి చక్కని ఉదాహరణ. తుంగభద్రా నది ఉత్తర తీరా న గల ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపురం, దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. శక్తి పీఠాలలో ముఖ్యమైన జోగుళాంబ ఇక్కడే ఉంది. ఈ దేవత కు అంకితం అయిన పంచమ కుల కన్యలే జోగు వారు, జోగీతలు, జోగీయులు. వీరు నృత్యం అభ్యసించి నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. వీరు రేణుకా దేవి బిడ్డలమని విశ్వసిస్తారు.

ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని పరిపాలించిన కాకతీయ ప్రభువులు, వారి సేనాధిపతులు, సామంతులు అందరూ నాట్య కళా వేత్తలే. కాకతీయ మహా సామ్రాజ్యంలో గణుతికెక్కిన వారు ముద్దసాని, ఆమె మనుమరాలు మాచలదేవి. ఈ మె ప్రతాపరుద్రుని ఆస్థాన ప్రముఖ నర్తకీమణి, నృత్య విద్య యందు బహుముఖ ప్రజ్ఞాశీలయే గాక తన జీవిత చరిత్రయే ఒక యక్షగానముగా రచన చేయించి ఆడించి చూచి ఆనందించినది. జాయపసేనాని గణపతి దేవుని గజసేనాపతి. ఇతను నృత్త రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి గ్రంధాలను రచించాడు. ఇతని గురువులు గండయామాత్యులు, సూరయామాత్యు లు. జాయప తన నృత్త రత్నావళిలో భాండ్, గోండ్లీ నృత్యాలను గురించి పేర్కొన్నాడు. భాండ్ నృత్యం కాశ్మీర్‌లో ప్రసిద్ధి చెందిన నృత్యం. గొండ్లీ అనే నర్తన రీతి కుండపైన ఆడే కుండలీ నర్తనం వంటిది. జయాప పేర్కొన్న మరొక నృత్యం ‘పేరిణి’ నృత్య తాండవం ప్రసిద్ధి చెందినది. పేరిణీ నృత్యాన్ని ‘పంచాంశి’గా సోమనాథుడు పేర్కొన్నాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రీయం అనే అలంకార శాస్త్రాన్ని రచించాడు. ఇతను ప్రతాపరుద్రుని ఆస్థాన కవి, అలంకార శాస్త్రవేత్త. పాల్కుర్కి సోమనాథుడు దేశీ, మార్గ నృత్యాలను తన గ్రంధాలలో వర్ణించాడు.

పూర్వం తెలంగాణా ప్రాంతంలో అమీరులు, గరీబులు అనే రెండు తరగతులకు చెందిన ప్రజలు ఉండేవారు. మధ్య తరగతి, బీద వారికొరకు యక్షగానాలు, వీధి భాగవతులు వీరి కొరకు ప్రదర్శింపబడేవి. ధనవంతులు దేవీడీలలోనూ, దివాన్‌లలోనూ ప్రదర్శింపబ డే నృత్య కేళికలను ప్రోత్సహించి నర్తకులను ఆదరించేవారు. శాస్త్రీయమైన నృత్యకేళికలను చూసే అవకాశం సా మాన్య ప్రజలకు ఉండేది కాదు. ఎప్పుడైనా ఆలయంలో జరిగే నృత్య కేళికలను చూసి ఆనందం పొందేవారు. ఆనాటి కాలంలో ఆలయం నాట్యాది కళలకు, విద్యలకు ఆధారభూతమైనది. దేవాలయము నాట్య, సంగీత, శిల్ప చిత్ర కళానిలయమై అది కళా పోషక సంస్థగా పరిణితి చెందినది. ప్రతి దేవాలయనిర్మాణములో నాట్య మండపము ప్రముఖ భాగమైనది. తెలంగాణా ప్రాంతంలో నర్తకులు, నాట్య మండపము లేని దేవాలయము ఉండేది కాదు.

అందాల రాశులైన అమర నర్తకలు తమ పాదాలకు పసుపు పారాణితో అలంకరించుకొని, స్వర్ణ మంజీరాలను భావయుక్తంగా పలికిస్తూ ఆలయాలలో, ఆరామాల్లో, రాజాస్థానాల్లో, పండిత సభల్లో, సామాన్య ప్రజల సమక్షంలో ప్రభోదాత్మకంగా నర్తనాన్ని మూడు విధాలుగా గత రెండు వేల సంవత్సరాలుగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. ఆనాటికి ప్రాచుర్యంలో వున్న నర్తన రీతులను గూర్చి పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, విధ్యానాథుని ప్రతాపరుద్రీ యం, క్రీడాభిరామం, శ్రీనాథకవి రచించిన కాశీ ఖండము, భీమేశ్వర పురా ణం, పల్నాటి వీరచరిత్రములందు ఆలయనర్తనములు, ఆస్థాన కేళికలు, సామాన్య ప్రజల నృత్య వినోదములను గూర్చి వివరంగా వర్ణించబడి ఉన్నది.

ఈ మూడు రకాలైన నర్తన రీతులలో మొదటిది ఆలయంలో స్వామిని పాటలతో మేల్కొలిపి, తిరిగి ఆ స్వామిని నిద్ర పోనిచ్చి, దిక్పాలకులకు ఆలయాన్ని అప్పగించే వరకు గల ఆగమ పద్దతికి చెందిన వివిధ నర్తనాలు మొదటి రకంవిగా చెప్పవచ్చును. ప్రాచీన, మధ్యయుగ కాలంలో విశిష్టత గాంచిన నృత్య శిల్ప కళా ఖండాలను మనము దేవాలయాలలో మాత్రమే చూడగలగుచున్నాము. ఆలయాలలో ముఖ్యంగా ధర్మపురి, వేములవాడ, మొదలైన దేవాలయాలలో కళాకారుల నృత్య కేళికల తీరు ఆగమరీతిని అనుసరించి ఉండేవి. తెలంగాణాలోని జమీందారులు తమ దేవాలయాలలో నృత్య పూజను జరిపించి, దేవ నర్తకులను పోషించేవారు. తెలంగాణలోని అనేక శివాలయాలలో దేవనర్తకులు శుద్ధనర్తనాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. వీటిలో ‘శివ ప్రియ’ అనే విశిష్ట నర్తనం రామప్ప దేవాలయంలోని ఒక స్థంభంపై శిల్ప రూపంలో మనకు కనబడుతుంది. ఇలాంటి నర్తనాన్ని వీర ముష్టి వారు తెలంగాణలో ప్రదర్శిస్తుండేవారు. ప్రజలను పాలించే ప్రభువుల ఆనందం కొరకు వారి మెప్పు పొందుటకు ప్రదర్శింపబడే నృత్త రీతి రెండవ రకానికి చెందినది. దీనిని ఆస్థాన కేళికా నృత్య రీతి అని అంటారు. దేశాన్ని బట్టి, దానిని పాలిం చే ప్రభువును బట్టి, అభిమానించే రసిక ప్రేక్షకులను బట్టి నృత్య కళాకారులు తమ నృత్యకళను అభ్యసించి ప్రదర్శించే వారు.

(తరువాయి వచ్చే వారం)

డాక్టర్ గోవిందు సురేంద్ర, స్థపతి

చరిత్ర శాఖ సహాయ ఆచార్యులు