
జీవితం చిత్రమైంది కదా. పదో తరగతిలో చిన్న అంతరాయం ఏర్పడింది. దాంతో రెగ్యులర్ ఇంటర్మీడియట్‌లో చేరడం కుదరక ఓరియంటల్ కాలేజీలో చేరాను. అలా జరిగి ఉండకపోతే కవిత్వంలోకి వచ్చి ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది. కానీ కొందరు మిత్రు లు నువ్వు ఏం చదివినా కవివే అయ్యేవాడివి అని అంటారు. శివారెడ్డి గారైతే ఏకంగా ‘ప్రసాదమూర్తి రాసినా కవే, రాయకపోయినా కవే’ అని ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. సరే, నా నేపథ్యం చెప్తాను.
నేను ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రు గ్రామంలో ఆగస్టు ఒకటి 1959లో పుట్టాను. మాది చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యవసాయ కుటుంబం. నా చిన్నప్పుడు కొల్లేరులో మా నాన్న సామూహిక వ్యవసాయం చేసిన సందర్భం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టం. ఆ చిన్ననాటి జ్ఞాపకాలతోనే ఎప్పుడూ కొల్లేటిని నా కవితల్లో పలవరిస్తూ ఉంటాను. నేను ఓరియంటల్ కాలేజీలో భాషాప్రవీణ, తర్వాత తెలుగు పండిట్ ట్రైనింగ్, ఆంధ్రా యూనివర్సిటీ లో ఎంఏ తెలుగు, అన్నామలై యూనివర్సిటీ నుంచి ప్రైవేట్‌గా ఎం.ఏ ఇంగ్లీష్, తెలుగు యూనివర్సిటీ నుంచి తెలుగులో దళిత కవిత్వం మీద పిహెచ్‌డి నా ఎడ్యుకేషన్ వివరాలు. ఓరియంటల్ కాలేజీలో చేరిన కొత్తలోనే పద్య రచన ప్రారంభించాను. తరువాత అనతి కాలంలోనే శ్రీశ్రీ రచనల ప్రభావం, ఇతర ఆధునిక కవుల ప్రభావం, కమ్యూనిస్టు భావజాలంతో వచన కవిత్వంలోకి వచ్చేసాను. అయితే అప్పుడప్పుడూ పద్యాలు కూ డా రాసేవాడిని. పొద్దుటూరులో ట్రైనింగ్ చేసినప్పుడు మొదటిసారి అష్టావధానం కూడా చేశాను.
ఇటీవల మా పెంపుడు కుక్క గోల్డీ మీద 150 పైగా పద్యాలు రాయడానికి ఆనాటి పద్య రచనానుభవమే కారణం. కమ్యూనిస్టు పార్టీలోకి, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంలోకి వచ్చాక ఆ నేపథ్యం లో రాసిన పాటలు, కవితలు చాలా ఉన్నాయి. అయితే 1999లో వచ్చిన నా మొదటి కవితా సంకలనం ‘కలనేత’లో ఎక్కువగా దళిత కవిత్వ ప్రభావం, అంబేద్కరిస్టు ఆలోచనా ప్రభావం ఉంటుంది. మార్క్సిస్టు భావజాలం నా మొత్తం సాహిత్యంలో అంతర్లీనంగా ఉంటుంది.
నా తొలి కవితా సంపుటి కలనేత మొదలుకొని మొత్తం 14 కవితా సంపుటాలు ఇప్పటివరకు వచ్చాయి. ‘సగం పిట్ట’ అనేది నా తొలి కథా సంపుటి. ‘కొల్లేటి కలలు’ తాజా కవితా సంపుటి. ‘ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం’ నా పరిశోధనా గ్రంథం. ఆత్మీయ కవి మిత్రులు సౌభాగ్య రాసిన పరిశీలనాత్మక పుస్తకంతో పాటు ప్రముఖ కవులు, విమర్శకులు రాసిన వ్యాసాలతో కలిపి ‘ప్రసాద సముద్రం’ అనే పుస్తకం వెలువడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వెన్నా వల్లభరావు గారు నా ఎంపిక చేసిన కవితలను హిందీలో అనువాదం చేశారు. అది పుస్తక రూపంలో వచ్చింది. టీవీ9లో పనిచేస్తుండగా 2008లో శ్రీశ్రీపై నిర్మించిన డాక్యుమెంటరీకి గానూ ఒక బంగారు నంది, ఒక తామ్ర నంది అవార్డులు గొప్ప జ్ఞాపకం. సాహిత్యంలో ఫ్రీవర్స్ ఫ్రంట్, ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు, సోమసుందర్ సాహితీ పురస్కారం వంటి కొన్ని విలువైన అవార్డులు అందుకోవడం నా అదృష్టం.
నేను 1984లో ఎంఏ పూర్తి చేసిన తర్వాత జర్నలిజంలోకి వచ్చి, తర్వాత కొంతకాలం టీచింగ్‌లో ఉన్నాను. ఆ తర్వాత మళ్లీ ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చాను. టీవీ9, 10టీవీ, హెచ్‌ఎంటీవీ తదితర టీవీలలో పనిచేశాను. కొంతకాలమే ఉపాధ్యాయుడిని. ఎక్కువ కాలం జర్నలిస్టుని. కవిత్వం నాలో సంపూర్ణ భాగం. సాహిత్య వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు చాలా రాశాను. ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో, విద్వేష రాజకీయాల విలయతాండవ నేపథ్యంలో నా అభిప్రాయాలు నిర్భయంగా చెప్పడానికి నాకు ఒక వేదిక కావాలని ‘ప్రమూటాక్స్ (pramu talks)’ పేరు మీద నా సొంత ఛానల్ నిర్వహిస్తున్నాను. ప్రపంచ సాహిత్యంలో పేరుపొందిన పుస్తకాలను నా దైన రీతిలో పరిచయం చేయాలని, అప్పుడప్పుడూ గొప్ప సినిమాలను కూడా నా పరిశీలనతో పరిచ యం చేయాలని ఈ వేదికను వాడుకుంటున్నాను.
ప్రతివారికి ఒక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది, ఉండాలి. కానీ కవిత్వం ఆ సిద్ధాంత ప్రకటన కో సం మాత్రమే అనుకుంటే తప్పు. కవిత్వ విస్తృతి వేరు. ఏమి రాసినా అది కవి హృదయం నుంచి వచ్చిందా, లేక పైపై సూత్రాల ముందస్తు ప్రణాళికలతో వచ్చిందా అనేది తెలిసిపోతుంది. సోషల్ మీడియా యుగంలో ఎవరికి వారికే తమ రచనలు ప్రకటించుకునే వేదిక దొరికింది. కానీ వేదిక మాత్రమే ఆయా రచనలను అనుభవించి పలువరించే పాఠకుడు కాదు కదా. చాలామంది యువతీ యువకులు బాగా రాస్తున్నారు. మీనమేషాలు లేకుండా అక్షరాలలో తమను తాము వ్యక్తం చేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ ఏదో లోటు కనిపిస్తోంది. రకరకాల మంటలలో మండిపోతున్న కాలం ఈ తరాన్ని చాలా డిమాండ్ చేస్తోంది. అది అందుకుంటున్నామా లేదా చూసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా తన నవల ప్రతులను లక్షకు పైగా అమ్మగలిగిన ఒక రచయిత, సీరియస్ గా సాహిత్యాన్ని గుండెలకు హత్తుకునే కొద్ది మంది అభిమానాన్ని కూడా పొందలేకపోయాడు. ఇది నేటి తరం అర్థం చేసుకోవాలి. దేశ దేశాల సాహిత్యం ఇప్పుడు మనకు కావలసిన భాషలో అందుబాటులో ఉంది. ఎక్కువ అధ్యయనం, అవగాహన, పరిశీలనాత్మక తడితో అక్షరాలను తడిమే సృజనాత్మకత పెంపొందించుకోవాలి.
– ప్రసాదమూర్తి