
అవాంతరాలు అధిగమించేందుకు నూతన పద్ధతి
హెలీబోర్న్ మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే నివేదిక ఆధారంగా
ముందుకెళ్లాలని ప్రభుత్వం సూత్ర ప్రాయ నిర్ణయం
కొత్త పద్ధతిలో త్వరతిగతిన మిగిలిన సొరంగం పనులు పూర్తి
చేయొచ్చని నిపుణుల అంచనా
యుద్ధప్రాతిపదికన పనులు
అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకోవాలని అధికారులకు
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం (ఎస్‌ఎల్‌బిసి) పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళిక ను అమలు చేయనుంది. సాంకేతిక సమస్యలు, భౌగోళిక అ డ్డంకుల దృష్ట్యా ఇప్పటి వరకు కొనసాగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ పద్ధతిని పక్క న పెట్టనుంది. సొరంగం తవ్వకంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించేందుకు ఇక పై ‘డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్’ పద్ధతిని అనుసరించాలని అధికారులు ప్రభుత్వానికి విన్నవించా రు. ఈ మేరకు ఇప్పటికే మన్నెవారిపల్లి ఔట్లెట్ వైపు ఉన్న భారీ టన్నెల్ బో రింగ్ మెషిన్‌ను తొలగించే ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యంత్రాన్ని బయటకు తీసేందుకు ఇంజనీర్లు, సిబ్బంది సుమారు నెల రోజుల పా టు శ్రమించాల్సి వచ్చింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం అనేది నల్లగొండ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు, హైదరాబాద్ నగరానికి నీరందించేందుకు నిర్మిస్తున్న ఒక భా రీ ప్రాజెక్ట్. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుం డి నీ టిని తరలించడానికి ఉద్దేశించారు. అయితే ని ర్మాణంలో ఉన్నప్పుడు ఫిబ్రవరి 2025లో సొరం గం కూలిపోయి కార్మికులు చిక్కుకోవడం, దాని తో పనులు నిలిచిపోవడం, ఇప్పుడు పునఃప్రారం భం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా గార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంతో పాటు ముఖ్యంగా నల్లగొండ జిల్లా కు తగినంత నీటి వనరులు రావడం లేదని విమర్శలున్నాయి. నాగార్జునసాగర్‌కు ప్రత్యామ్నాయంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకువచ్చే ప్రతిపాదనలపై చర్చించాలని డిమాండ్స్ పెరిగాయి. ఈ క్రమంలో 1978వ సంవత్సరంలో టి.అంజ య్య సిఎంగా ఉన్న సమయంలో వెనుకబడిన ప్రాంతాల ఇరిగేషన్ మీద చర్చ జరిగింది. దీం తో ఆనాటి ఇరిగేషన్ మంత్రి సుధాకర్‌రావు నేతృత్వంలో శ్రీశైలం నుంచి నీటిని అందించడానికి సాధ్యాసాధ్యాలపై ఒక టెక్నికల్ కమిటీ వేశారు.
ఈ టెక్నికల్ కమిటీ సర్వే జరిపిన అనంతరం శ్రీ శైలం నుంచి మూడు లక్షల ఎకరాలకు టన్నెల్ ద్వారా నీరు అందించవచ్చని రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్టులోనే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగాన్ని 9 మీటర్ల వ్యాసంతో 45 కిలోమీటర్ల పొడవున 300 నుంచి 500 మీటర్ల దిగువన కొండలలో తవ్వాల్సి వస్తుందని ప్రతిపాదించారు. దీని ఆధారంగా శ్రీశై లం ఎడమ గట్టు నుండి సొరంగ మార్గం తెరపైకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో దోమలపెంట ఇన్‌లెట్ వైపు సొరంగం లోపల జరిగిన ఘోర ప్రమాదం కారణంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో యంత్రాలు ఇరుక్కుపోవడం, భౌగోళికంగా రాళ్ల స్వభావం అనుకూలించక ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
రెండు వైపులా పనులు ఆగిపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. సొరంగం మార్గంలో ఉన్న శిలల పటుత్వం, భూగర్భ జలాల ఉనికిని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల హెలీబోర్న్ మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే ను నిర్వహించింది. ఈ సర్వే నివేదిక అధికారులకు అందడంతో దాని ఆధారంగా తవ్వక పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కొత్త పద్ధతిలో పనులు చేపడితే తక్కువ సమయంలోనే మిగిలిన తవ్వకాన్ని పూర్తి చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ప్రణాళికతోనైనా ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడుతుందని ఆ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన ఎస్‌ఎల్‌బిసి పనులు: ఉత్తమ్
ఎస్‌ఎల్‌బిసి పనుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆదివారం నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాసు,ఎస్‌ఎల్‌బిసి సలహాదారు రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ హర్‌పాల్‌సింగ్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఎస్‌ఎల్‌బిసి పనులు వెంటనే చేపట్టాలని, సొరంగం తవ్వకాలకు టెక్నాలజీ వినియోగించుకోవాలని సూచించారు. పనుల పురుద్ధరణకు చేపట్టిన ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పూర్తి అయినట్టు మంత్రి వివరించారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అవీ జరగడానికి ఆస్కారం ఉన్న చోట అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. అలాగే భూగర్భ పరిస్థితుల అంచనాకు త్రిడీ మానిటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకోవాలని సూచించారు. సొరంగం పనుల్లో పాల్గొనే కార్మికులకు వారి జీతానికి అదనంగా 25 శాతం చెల్లించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.