
ఇరు దేశాల పరస్పర హెచ్చరికలు, పరిస్థితి ఉద్రిక్తం ఏ క్షణాన్నైనా
దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం
ఇరాన్ స్వేచ్ఛను కోరుకుంటోంది.. అందుకు మేం సంపూర్ణ మద్దతిస్తాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
భగ్గుమన్న ఇరాన్, ప్రత్యేక పార్లమెంట్ సమావేశం
అమెరికాకు చావుదెబ్బ తప్పదని హెచ్చరిక
ఇజ్రాయెల్‌నూ దెబ్బతీస్తామని వార్నింగ్
టెహ్రాన్ సహా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న నిరసనలు
సమాజాన్ని నాశనం చేసే.. కుట్ర ఇరాన్ అధ్యక్షుడి ఆగ్రహం
టెహ్రాన్/వాషింగ్టన్: అత్యంత బలీయ దేశాలైన ఇరాన్, అమెరికా మధ్య తీవ్రస్థాయి యుద్ధ హె చ్చరికలు వెలువడ్డాయి. కొద్ది రోజులుగా ఇరా న్ వీధుల్లో జరుగుతోన్న నిరసన ప్రదర్శనలు, ఖమేనీ పాలక యంత్రాంగం అణచివేతలు, ఇం దులో తమ జోక్యానికి అమెరికా హెచ్చరికలతో ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్త దశను దాటి, ఎప్పుడై నా దాడులు, ప్రతిదాడుల దశ చేరుకుంది. అ మెరికాకు చావుదెబ్బ తప్పదని ఆదివారం ఇరా న్ హెచ్చరించింది. తమ దేశంలో సాగుతున్న ని రసనలను సాకుగా తీసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సేనలు దాడులకు దిగితే వాటిపై తమ సేనలు విరుచుకుపడుతాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా సేనలను గురిచేసుకుని దెబ్బతీస్తామని ఇరాన్ ప్రతిన వహించింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకునేందుకు, వ్యూహం ఖరారుకు ఇరాన్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు అయ్యాయి.
ఈ సందర్భంగా ఎంపిల ఉద్రిక్త, ఉద్విగ్నభరిత ప్రసంగాల తరువాత స్పీకర్ మెహమ్మద్ బఘేర్ కాలిలిబాఫ్ తమ శత్రుదేశాలు ఇజ్రాయెల్, అమెరికాలకు ఘాటైన పదజాలంతో, పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారం దశలో హెచ్చరికలు వెలువరించారు. నిర్ణీతలక్షాలను ఎంచుకుని దాడులకు దిగుతామని, అమెరికా, ఇజ్రాయెల్ సేనలు తమపై దాడికి దిగితే వాటిని తిప్పికొట్టడం జరుగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఇది అమెరికాకు చావుదెబ్బనే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఇక తమ తక్షణ చర్యలు తప్పవని అంతకు ముందు అమెరికా అధ్యక్షులు సోషల్ మీడియా ద్వారా వెలువరించిన సందేశంపై ఇరాన్ పార్లమెంట్ ద్వారా ప్రతిచర్యకు ప్రకటన వెలువడింది. తమ దేశ సిద్ధాంత విధానపరమైన ఆలోచనాధోరణికి సవాలు విసురుతూ ఇరాన్‌లో సాగుతున్న నిరసన ప్రదర్శనలను పార్లమెంట్ ఖండించింది.
ఇరాన్‌లో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ నిలిపివేశారు. దీనితో వీధుల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదనేది అనేది స్పష్టతకు రావడం లేదు. ఓ వైపు తీవ్రస్థాయి నిరసనలు, ఇందుకు ధీటుగా అణచివేత చర్యలతో పలు ప్రాంతాలలో ప్రత్యేకించి టెహ్రాన్‌లో మృతుల సంఖ్య 200 దాటింది. అయితే దీనిపై స్పష్టత రావడం లేదు. దాదాపు 2600 మందిని భద్రతా బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదంతో అణచివేతలు ఉంటాయని ఇస్లామిక్ పాలక అధికార యంత్రాంగం ఖమేనీ తరఫున హెచ్చరించింది. అయితే నిరసనకారులు ఇక్కడి మత ఛాందసవాద పాలకులపై నిరసనలను వినూత్న పంథాలో సాగిస్తూ ఉన్నారు. తమ దేశంలో జోక్యం జరిగితే ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ అమెరికా చర్యలను చూస్తూ సహించేది లేదని ఇరాన్ పార్లమెంట్ ప్రకటన వెలువరించింది. వారి దాడికి ప్రతిగా తమ దాడులు చట్టబద్ధమైన లక్షాలను ఎంచుకుని సాగుతాయని తెలిపారు. చట్టసభ సభ్యులు ఆవేశంతో స్పీకర్ వేదిక వద్దకు దూసుకువెళ్లారు. అమెరికా పని పట్టాల్సిందే అని నినాదాలకు దిగారు. ఇదంతా కూడా ప్రత్యక్ష ప్రసారంలో వెలువడింది. అసాధారణ రీతిలో ఇరాన్ పార్లమెంట్ సెషన్ సాగింది. దీనిని అతివాద నేత ఖాలీబాఫ్ స్పీకర్‌గా నిర్వహించారు. అంతకు ముందు ఆయన దేశాధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇరాన్ అధికారిక టీవీలో పార్లమెంట్ సెషన్ ప్రసారం అయింది.
నిరసనకారులు విదేశీ శక్తులతో కదం తొక్కుతున్నారని స్పీకర్ ఆరోపించారు. వీరిని అణచివేసేందుకు పోలీసు బలగాలు, ఇరాన్ పారామిలిటరీ రెవెల్యూషనరీ గార్డు, అనుబంధం అయిన అఖిలపక్ష కార్యకర్తల స్థాయిబాసిజ్ ధైర్యంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. ఇరాన్ తీవ్రస్థాయిలో వ్యవహరిస్తుందని నిరసనకారులను హెచ్చరించారు. ఈ దశలో ఆయన ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడి జరుగుతుందని తెలిపారు. ఇజ్రాయెల్ కేవలం ఆక్రమిత ప్రాంతం. ఈ ప్రాంతంపై , అమెరికా సేనలపైనా తమ ముందస్తు దాడి తప్పదని హెచ్చరించారు. అమెరికా జోక్యం చేసుకుంటే తమ తీవ్రస్థాయి చర్య తప్పదని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడి జరిగితే ఇజ్రాయెల్ అనబడే ఆక్రమిత ప్రాంతం, అమెరికా సైనిక స్థావరాలు, కేంద్రాలు, ఈ ప్రాంతంలోని అమెరికా నౌకలను చట్టబద్ధమైన తమ టార్గెట్లు అవుతాయని, వాటిని దెబ్బతీయడం జరుగుతుందని తెలిపారు. స్పీకర్ నుంచి తీవ్రస్థాయి ప్రకటన వెలువడినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ సేనలపై దాడులకు సంబంధించి తుది నిర్ణయం కేవలం సుప్రీం నేత 86 సంవత్సరాల అయాతుల్లా అలీ ఖమేనీపైనే ఆధారపడి ఉంటుంది. అయితే జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల భీకర యుద్ధం దశలో పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉన్న ఇరాన్ వైమానిక బలగం ఇప్పటికిప్పుడు ఈ బలహీనతతో అమెరికా, ఇజ్రాయెల్‌లపై దాడికి దిగుతుందా అనేది కీలక విషయం అయింది.
ఇరానీయన్ల స్వేచ్ఛకు అమెరికా మద్దతు ః ట్రంప్
ఇరాన్‌లో శాంతియుతంగా ఇస్లామిక్ పాలకులపై నిరసనలు సాగుతున్నాయి. వీటిని అణచివేసేందుకు కుటిల నీతిని ప్రదర్శిస్తున్నారు. ఇరాన్ ఇప్పుడు స్వేచ్ఛను కోరుకొంటోంది. ఈ అభిలాష ఇప్పుడు ఇంతకు ముందెప్పుడూ లేనంతగా ఉంది. దీనికి అమెరికా నుంచి పూర్తి స్థాయిలో మద్దతు దక్కుతుంది అని అమెరికా అధ్యక్షులు ట్రంప్ వెల్లడించారు. శనివారం ట్రంప్ ఈ ప్రకటన వెలువరించారు. న్యూయార్క్ టైమ్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇరాన్ లోతట్టు ప్రాంతాలలో అమెరికా చర్యలకు దిగే విషయం పరిశీలించాలని ట్రంప్ అక్కడి సైన్యానికి సూచించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని పత్రికలు పేర్కొన్నాయి.
టెహ్రాన్, మషాద్ ఇతర ప్రాంతాలలో నిరసనలు
ఇంటర్నెట్ నిలిపివేత దశలో ఇరాన్‌లో ఇప్పుడు నిరసనల తీవ్రతపై స్పష్టమైన సమాచారం వెలువడలేదు. అయితే స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా వెలువడుతున్న ఫోటోలు, సమాచారం క్రమంలో నిరసనలు టెహ్రాన్‌తో పాటు మషాద్ ఇతర ప్రాంతాలో తీవ్రస్థాయికి చేరినట్లు వెల్లడైంది. పలు చోట్ల నిరసనకారులు తమ సెల్‌ఫోన్ల లైట్లు వెలిగించడం, బాణాసంచా పేల్చడం, ఇతరులు పలు రకాల వాయిద్యాలను మోగించడం వంటి చర్యలకు దిగుతున్నారు. కారు హారన్ల మోతలతో వీధుల్లో గందరగోళం సాగుతోంది. టెహ్రాన్‌కు 725 కిలోమీటర్ల దూరంలోని రెండో అతి పెద్ద నగరం మషాద్ ఇప్పుడు నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య బాహాబాహితో వేడెక్కింది. ఈ నగరం ఇమామ్ రెజా క్షేత్రం ఉన్న ప్రాంతం. ఇది షియా ఇస్లామిక్ వర్గాలకు అత్యంత పవిత్రమైనది. ఇక్కడ తీవ్రస్థాయి నిరసనలు దేశ సిద్ధాంతపర ఆలోచనలపై పెను ప్రభావానికి దారితీసే ముప్పు ఉంది. నిరసనలు ఇప్పుడు టెహ్రాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలోని కెర్మాన్‌కు కూడా వ్యాపించాయి. ఇక ఘర్షణకారులను తీవ్రస్థాయిలో శిక్షిస్తామని ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజిష్కయాన్ హెచ్చరించారు. విధానాలపై నిరసనలకు దిగే వారితో చర్చిస్తామని అయితే ఈ సాకుతో హింసాకాండకు పాల్పడే వారిని సహించేది లేదని హెచ్చరించారు.