
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని ఆమె హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చడంపై కవిత మండిపడ్డారు. మిస్టర్ తేజస్వీ సూర్య.. తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల ఆకాంక్ష అంటే నీకు అంత చులకనా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడి పోరాటాన్ని అంతలా కించపరుస్తావు? అంటూ నిప్పులు చెరిగారు. ఆరు దశాబ్దాల వివక్షకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవం కోసం చేసిన ఈ మహోద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం అజ్ఞానానికి పరాకాష్ట అని విమర్శించారు.
తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను కూడా తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలతో అవమానించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, తెలంగాణ అస్తిత్వంపై జరిగిన దాడి అని ఆమె అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా సరే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ALSO READ : తెలంగాణ ఏర్పాటును.. పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య
తెలంగాణ బీజేపీ ఎంపీలపై కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మీ పార్టీ ఎంపీ మాట్లాడుతుంటే.. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే తేజస్వీ సూర్యతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే సత్తా లేకపోతే, ఎంపీలుగా కొనసాగే అర్హత మీకు లేదని, వెంటనే పదవులకు రాజీనామా చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.