Reading Time: < 1 minute

క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్‌తో తెలంగాణ కొత్త రేషన్ కార్డులు.. ప్రత్యేకతలు ఇవే!

Caption of Image.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సరికొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ జారీకి సర్కార్ రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పనలో భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోతో పాటు.. రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నంబర్ వంటి కీలక వివరాలు ముద్రించనున్నారు. ముఖ్యంగా ఈ కార్డులను ఎవరూ ఫోర్జరీ చేయకుండా, నకిలీవి తయారు చేయకుండా మొత్తం 9 రకాల ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. 

ఇందులో తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన సురక్షిత హోలోగ్రామ్, స్పర్శతో గుర్తించే ‘Government of Telangana’ అక్షరాలు, మాగ్నిఫికేషన్‌లో మాత్రమే కనిపించే అతిచిన్న మైక్రో టెక్స్ట్ ఉన్నాయి.
వీటితో పాటు ‘GoTG ORIGINAL’ సూపర్ ఇంపోజ్డ్ లెటర్స్, ప్రభుత్వ చిహ్నం వాటర్ మార్క్, ఇన్విజిబుల్ యూవీ (UV) లోగో, ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ (QR Code) , గిల్లొషే ప్యాటర్న్ వంటి అత్యాధునిక సాంకేతిక భద్రతా ప్రమాణాలను ఈ కార్డుల్లో చేర్చారు.

రేషన్ కార్డుల దుర్వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ స్మార్ట్ కార్డుల విధానం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ పంపిణీతో లబ్ధిదారులకు మరింత పారదర్శకమైన సేవలు అందనున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.