
నేను రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ హనుమకొండలో సందడి చేసింది. ప్రసిద్ధ కాళోజి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘నేను రెడీ’ మూవీ సాంగ్స్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా ముగిసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. చిత్రంలోని ‘మస్తుగుందిర యవ్వారం’ అనే మాస్ పాటను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వరంగల్ యాస, భాషతో కూడిన మంచి మాస్ సాంగ్స్ ఈ చిత్రంలో ఉండటం సంతోషకరమని ఆయన అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా హవిష్, హీరోయిన్‌గా కావ్య థాపర్ నటిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో హీరో హవిష్, హీరోయిన్ కావ్య థాపర్ తో పాటు ప్రముఖ నటి జబర్దస్త్ రోహిణి స్టేజ్ పై చేసిన సందడి హైలైట్‌గా నిలిచింది. అభిమానులు, యువత కేరింతల నడుమ వారు వేసిన జోష్‌తో కూడిన స్టెప్పులు అక్కడున్న వారందరినీ ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. అంతేకాదు, ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను కూడా కచ్చితంగా హనుమకొండలోనే నిర్వహించాలని ఆయన ‘నేను రెడీ’ టీమ్‌కు విజ్ఞప్తి చేశారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వ ప్రతిభ, నటీనటుల హుషారైన డాన్సులు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.