
ఎండాకాలంలో ఎండలు పెరగడంతో చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. అయితే, ఈ నొప్పి కేవలం వేడి వల్ల వస్తుందా లేదా అది మైగ్రేన్ సమస్యనా అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దీనిపై ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కొన్ని కీలక విషయాలను చెప్పారు.
సాధారణ తలనొప్పి ఒత్తిడిలా అనిపిస్తుంది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నా లేదా నీళ్లు ఎక్కువగా తాగినా తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ వల్ల తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో ఒక పక్కన మాత్రమే నొప్పి రావడం, సుత్తితో కొట్టినట్లు అనిపించడం దీని లక్షణం. దీనితో పాటు వాంతులు, వికారం, వెలుతురు లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటివి జరుగుతాయి.
సమ్మర్లో ఎందుకు వస్తుందంటే
ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం డీహైడ్రేషన్ కి ముఖ్య కారణం. దీనితో పాటు నిద్ర సరిగ్గా లేకపోవడం, భోజనం టైంకి తినకపోవడం, అతిగా కాఫీ లేదా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా తలనొప్పి పెరుగుతుంది. మైగ్రేన్ ఉన్నవారికి అధిక సూర్యరశ్మి తల నొప్పిని పెంచుతుంది.
మైగ్రేన్ ముందస్తు లక్షణాలు:
తలనొప్పి మొదలయ్యే ముందే శరీరం కొన్ని సంకేతాలిస్తుంది:
*చిరాకుగా ఉండటం లేదా నీరసం.
*మెడ బిగుసుకుపోవడం.
*కళ్ల ముందు మెరుపులు లేదా చుక్కలు కనిపించడం
జాగ్రత్తలు:
*దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి.
*ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. వెళ్లాల్సి వస్తే గొడుగు, సన్ గ్లాసెస్ వాడాలి.
*సరైన సమయానికి నిద్రపోవడం, పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
*ఒత్తిడి తగ్గించుకోవడం కోసం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మైగ్రేన్ అదుపులో ఉంటుంది.
డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి
తలనొప్పి అకస్మాత్తుగా చెప్పలేనంతగా పెరిగినా, జ్వరం వచ్చినా, మాట తడబడినా లేదా తల తిరుగుతున్నా వెంటనే డాక్టరును సంప్రదించాలి. తలనొప్పిని కేవలం వేడి వల్ల వచ్చిందని నిర్లక్ష్యం చేయకుండా, పదే పదే వస్తుంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.