Reading Time: < 1 minute

శ్రీరామ్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం ‘ది మేజ్’. ప్రియాంక శర్మ, హృతిక శ్రీనివాసన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే దర్శకుడు. కేఎస్‌ఆర్ సమర్పణలో ఉదయ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కె. రెడ్డి పల్వాయి, కె. శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలే చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘ఈ సినిమా ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితాన్ని కేంద్రంగా తీసుకొని సాగుతుంది. అతని వాస్తవిక జీవితం, మానసిక స్థితి అంతగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి, అతను ఒక కలల ప్రపంచంలో జీవిస్తున్నట్టే అనిపిస్తుంది.

ఈ సినిమా జ్ఞాపకాలు, గ్రహణశక్తి, గుర్తింపు వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తూ, నిజం అంటే ఏమిటి? అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది. మర్మమైన ఆ వ్యక్తి ఉనికి చివరి వరకు ఒక ప్రశ్నగానే మిగులుతుంది. అతను కథానాయకుడి అవచేతన మనస్సుకు ప్రతీకనా? భయం, అపరాధభావం లేదా గతంలోని గాయాల రూపమా? లేక నిజంగానే అతని జీవితంతో ముడిపడి ఉన్న ఎవరైనా వ్యక్తినా? ఆ ప్రశ్నకు సమాధానం అతని మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు కీలకంగా మారుతుంది. మొత్తంగా, ఈ సినిమా వాస్తవం మరియు భ్రమల మధ్య సరిహద్దులను చెరిపేస్తూ, ప్రేక్షకులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచుతుంది‘అని అన్నారు.