
అమరావతి: ఆయన చేసేది హోంగార్డు జాబ్, నెలకు జీతం 25 వేల రూపాయలు, కానీ ఆయన అక్రమంగా 20 కోట్ల పైనే ఆస్తి సంపాదించినట్టు ఎసిబి దాడుల్లో తెలిసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… గోకపేటలోని లక్ష్మీనివాస్ అపార్ట్‌మెంట్‌లో నెట్టి శ్రీనివాసరావు నివసిస్తున్నారు. 2010లో విజయనగరంలో పోలీస్ శాఖలో హోంగార్డుగా చేరారు. అప్పటి నుంచి 2025వరకు ఎసిబి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎసిబి అధికారుల దాడులు తెలుసుకొని ముందే అధికారులకు సమాచారం ఇచ్చేవాడు. దీంతో శ్రీనివాసరావుక పెద్ద మొత్తంలో సదరు అధికారులు నగదు లేదా ఇళ్ల స్థలాల రూపంలో ఇచ్చేవారు. హోంగార్డు శ్రీనివాసరావు కదలికలపై ఎసిబి అధికారులకు అనుమానం రావడంతో నిఘా పెట్టారు. అనంతరం సంవత్సరం క్రితం అతడి పోలీస్ జిల్లా కార్యాలయానికి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఎసిబి అధికారులు అతడిపై నిఘా ఉంచారు. గురువారం హోంగార్డు ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు చేయగా మార్కెట్లో రూ.20 కోట్ల పైనే ఆస్తులను ఉన్నాయని అధికారులు గుర్తించారు. అతడి ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. రెండు ప్లాట్లు, ఒక ఆర్‌సిసి బిల్డింగ్, నాలుగు ఇళ్ల స్థలాలు, 166 గ్రాములు బంగారం, రూ.60 వేల నగదు, రూ.7.07 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కారు, బైక్ తదితర ఆస్తులను సీజ్ చేశారు.