Reading Time: 2 minutes

అన్ని అవినీతి కేసులపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరపాలి

ఈ ప్రభుత్వం కూడా ఫోన్ టాపింగ్ చేస్తోంది

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్నది యాక్టింగ్ మాత్రమేనని, యాక్షన్ తీసుకున్నదేమీ లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. నోటీసులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడానికే పరిమితమవుతుని అన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం వంటి అన్ని అవినీతి కేసులపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, స్కాంల విషయంలో కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ పార్టీల మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహార శైలి ఒకే విధంగా కొనసాగుతున్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో గొర్రెల పంపిణీ స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఆ స్కాంపై ఇప్పటివరకు ఎలాంటి సమగ్ర విచారణ జరగడం లేదని అన్నారు. నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొనసాగిన అదే కాంట్రాక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. కేవలం కాంట్రాక్టర్లు, మంత్రివర్గం మారాయి తప్ప కమిషన్ల విధానం మాత్రం అలాగే కొనసాగుతోందని పేర్కొన్నారు. లిక్కర్ పాలసీ విషయంలోనూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలసీలనే కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా అంగీకరిస్తోందని తెలిపారు.

ఎన్నికల ముందు చెప్పిన విషయం ఏమైంది

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాంలపై వంద రోజుల్లోనే విచారణ పూర్తి చేసి, కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని, అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామనే మాటలు చెప్పారని, ఇప్పుడు కేవలం సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, ప్రధాన నిందితులను కాపాడుతున్నారు తప్ప ఏ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా కొన్ని బ్యారేజీల వరకే సీబీఐ విచారణకు అప్పగించిందని, అయితే మొత్తం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని రాంచంద్రరావు డిమాండ్ చేశారు.

తెలంగాణలో బిజెపి క్రమేణా బలపడుతోంది

బిజెపికి పెరుగుతున్న ప్రజాదరణను అడ్డుకోవడానికే కాంగ్రెస్ -బీఆర్‌ఎస్ పార్టీలు ఇలాంటి నాటకాలు చేస్తున్నాయని బిజెపి అధ్యక్షుడు రాంచంద్రరావు విమర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గతంలో 163 సర్పంచ్ స్థానాలు మాత్రమే గెలిచిన బిజెపి, ఇటీవలి ఎన్నికల్లో సుమారు వెయ్యి సర్పంచ్‌లు, పదివేల వార్డు మెంబర్లు, 1200 ఉపసర్పంచ్ స్థానాలను గెలుచుకుందని గుర్తు చేశారు. ఇది తెలంగాణలో బిజెపి క్రమేణా బలపడుతోందని స్పష్టంగా సూచిస్తోందని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి, బిజెపిని గెలిపించాలని ఆయప ప్రజలను కోరారు.