Reading Time: 1 minute

న్యూఢిల్లీ: పలువురు వివిధ రంగాల ప్రముఖులు విమాన , హెలికాప్టర్ల ప్రమాదాలలో దుర్మరణం చెందారు. వీరిలో రాజకీయ దిగ్గజాలు పలువురు ఉన్నారు. ప్రమాదాలలో మృతి చెందిన ప్రముఖుల వివరాలు ఘటనల అంశం అజిత్ పవార్ విషాదాంతం దశలో ప్రస్తావనకు వచ్చింది. భారతదేశ అణు భౌతికశాస్త్రవేత్త హోమి జహంగీర్ బాబా 1966 జనవరి 24న ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విమానం స్విస్ అల్ప్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జెనీవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో సరైన సమాచార సమన్వయం లేకపోవడంతో ప్రమాదం జరిగింది.

1980లో సంజయ్ గాంధీ, 2009లో వైఎస్..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23వ తేదీన ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ వద్ద సాహస గగనతల విన్యాసాలకు దిగుతూ ఉండగా విషాదాంతం చెందారు. విమానం అదుపు తప్పి, నేలకూలింది. సంజయ్ గాంధీ విషాదాంతం సంచలనం అయింది. తరువాత 2001లో యువ నేత, మాజీ విమానాయాన మంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్‌కు రాజకీయ సభ కోసం వెళ్లుతున్నప్పుడు జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందాడు. సరైన వెలుతురు లేకపోవడంతో విమానం పతనం అయింది.

2002లో తెలుగుదేశం నేత స్పీకర్ బాలయోగి 2002 మార్చి 3వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద చనిపోయారు. కైకలూరు వద్ద చెరువులో పడిన దశలో ఈ కోస్తా నేత దుర్మరణం చెందారు. మేఘాలయ నేత సంగ్మా షిల్లాంగ్‌లో పవన్ హన్స్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన 2004 సెప్టెంబర్‌లో జరిగింది.

ఒపి జిందాల్ , సురేం దర్ సింగ్ 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నదశలో డోర్జీ ఖండూ ఇతరులు హెలికాప్టర్ దుర్ఘటనలో 2011 ఎప్రిల్ 30న చనిపోయారు. ఇక సైనిక ప్రధానాధికారి సిడిఎస్ బిపిన్ రావత్ అత్యంత మిస్టరీగా మిగిలిన హెలికాప్టర్ ప్రమాదంలో 2021 డిసెంబర్ 8న మృతి చెందారు.

ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 2025 జూన్ 12న అహ్మదాబాద్ వద్ద జరిగిన ఘోరాతిఘోర ఎయిరిండియా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు.