
యంగ్ హీరో హవిష్… దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలసి పూర్తి ఎంటర్‌టైనర్ ’నేను రెడీ’ చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌తో మంచి అంచనాలను సృష్టించిన ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ టీజర్‌ను ఇంతకు ముందు ప్రభాస్ ’రాజా సాబ్’ చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. ఈ టీజర్ ఒక ఎంటర్‌టైనింగ్ కథాంశాన్ని పరిచయం చేస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధ్యత గల మధ్యతరగతి ఆంధ్ర యువకుడికి, ఒక మధ్యతరగతి తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం నేపథ్యంలో త్రినాధ రావు నక్కిన మరోసారి పూర్తి ఎంటర్‌టైనర్ రూపొందించడంలో తన మార్క్‌ని చూపించారు. హవిష్ బాధ్యత గల మధ్యతరగతి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయి తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. కావ్య థాపర్ నిజాం అమ్మాయిగా ఆకట్టుకుంది. వారిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణీయంగా ఉంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, విటివి గణేష్ వంటి హాస్య నటులు ఉండటంతో, ఈ చిత్రం నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తుందని తెలియజేసింది. 2026 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.