
న్యూయార్క్: అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల దిశగా అడుగులు వేస్తుండడంతో ఆదేశంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసింది. దీంతో ట్రంప్ తీరుపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ పేరు ప్రస్తావించకుండా ఓ కార్టూన్‌ను ఖమేనీ పోస్ట్ చేశారు. అహంకారం, గర్వం తలకెక్కి ఈ ప్రపంచాన్నే శాసించాలని అనుకుంటున్నాడంటూ పోస్ట్ చేశారు. అమెరికా తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.
కొద్ది రోజులుగా ఇరాన్ వీధుల్లో జరుగుతోన్న నిరసన ప్రదర్శనలను ఖమేనీ పాలక యంత్రాంగం అణచివేస్తోంది. ఇరాన్ దేశ పౌరులను అణచి వేయడం మానుకోవాలని ఆ దేశపు సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాకు చావుదెబ్బ తప్పదని ఆదివారం ఇరాన్ హెచ్చరించిన విషయం విధితమే. తమ దేశంలో సాగుతున్న నిరసనలను సాకుగా తీసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సేనలు దాడులకు దిగితే వాటిపై తమ సేనలు విరుచుకుపడుతాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా సేనలను గురిచేసుకుని దెబ్బతీస్తామని ఇరాన్ యుద్ధానికి దిగబోతుంది.