Reading Time: < 1 minute

ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో కథానాయిక మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. హీరో నవీన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుంది. సరికొత్తగా వినోదాన్ని అందించే చిత్రమిది. భీమవరం బాల్మా, రాజుగారి పెళ్ళిరో లాంటి క్యూట్ మాస్ డ్యాన్స్ నెంబర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం నాగ చైతన్యతో వృషకర్మ సినిమా చేస్తున్నాను’ అని తెలిపారు.