
- దివ్యాంగుల సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
- గత పదేండ్లలో 1,500 మందే..
- ఇప్పుడు ఒకేసారి 8 వేల మందికి లబ్ధి
- వైకల్యం అర్హత 75 నుంచి 40 శాతానికి తగ్గింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. పెద్ద ఎత్తున సహాయక పరికరాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉచిత పరికరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దఫా కేవలం సాధారణ పరికరాలకు పరిమితం కాకుండా స్కూటీలు, ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్‌చైర్లు, బ్యాటరీ ట్రైసైకిళ్లను ప్రభుత్వం అందిస్తోంది. ఉపాధి కోసం బిజినెస్ ఎంపవర్‌మెంట్ కార్ట్స్, బిజినెస్ ఆటోలు, బ్యాటరీ ట్రైసైకిళ్లను కూడా ఇస్తోంది. దివ్యాంగ విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు అందజేస్తున్నారు.
గతంతో పోలిస్తే భారీ మార్పు..
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరుతో కేవలం 1,500 పరికరాలను మాత్రమే పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ పరికరాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరికరాల పంపిణీకి నిధులు విడుదల చేయాలని కోరారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైకల్యం 75 శాతం పైన ఉంటేనే పరికరాలకు అర్హులని ఉత్తర్వులు ఉండేవి. ప్రస్తుతం వైకల్యం శాతాన్ని 75 నుంచి 40కు తగ్గించడంతో వేలాది మంది దివ్యాంగులు అర్హులయ్యారు. గతంలో డిగ్రీ, పీజీ పూర్తి చేస్తేనే దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చేవారు, ఇప్పుడు 10వ తరగతి పూర్తి చేస్తే పంపిణీ చేస్తున్నారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే కల్యాణలక్ష్మి సాయంతోపాటు అదనంగా రూ.2 లక్షలు, కోర్టు ఉద్యోగాల్లో 4 శాతం, ఉన్నత విద్యలో 5 శాతం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం కింద 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.