
కార్ల గురించి చాలా కాలంగా మనలో చాలామంది నమ్ముతున్న కొన్ని అపోహలు… నిజానికి ఇప్పుడు మారాయి. పాత కాలపు కార్ల పద్ధతులు ఇప్పటి లేటెస్ట్ కార్లకు అస్సలు వర్తించవు. అవేంటో, వాటి వెనక ఉన్న అసలు నిజాలు ఏంటో చూద్దామా:
1. వెళ్లే ముందు ఇంజిన్ హీట్ చేయడం
అపోహ ఏంటంటే.. ఎక్కడికైనా వెళ్లే ముందు, ముఖ్యంగా చలికాలంలో కారును కొన్ని నిమిషాల పాటు ఆన్ చేసి అలాగే వదిలేయాలి. ఇంజిన్ వేడెక్కాలని చాలా మంది ఇలా చెబుతుంటారు.
నిజం ఏంటంటే…. ఇది పాత కాలపు కార్లలో ఉండే కార్బ్యురేటర్ ఇంజిన్ల నాటి పద్ధతి. కానీ ఇప్పటి ఆధునిక కార్లలో ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్లు వస్తున్నాయి. కారు కదలడం మొదలుపెట్టిన తక్కువ సమయంలోనే ఇవి వాటంతట అవే వేడెక్కుతాయి. కాబట్టి అనవసరంగా ఇంజిన్ ఐడిల్‌గా ఉంచి పెట్రోల్/డీజిల్ వృధా చేసుకోవడం తప్ప ఎలాంటి లాభం లేదు.
2. మాన్యువల్ గేర్ కార్లే ఎక్కువ
అపోహ ఏంటంటే.. మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్ కార్లు ఆటోమేటిక్ కార్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయని నమ్ముతుంటారు.
నిజం ఏంటంటే… టెక్నాలజీ మారడంతో ఆటోమేటిక్ అండ్ సీవీటీ (CVT) కార్లలో గొప్ప మార్పులొచ్చాయి. ఈ రోజుల్లో వస్తున్న చాలా ఆధునిక కార్లలో ఆటోమేటిక్ గేర్ కూడా మాన్యువల్ కార్లతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువే ఇంధనాన్ని సేవ్ చేస్తున్నాయి.
3. ప్రీమియం ఇంధనం పోస్తే
అపోహ ఏంటంటే… సాధారణ పెట్రోల్‌కు బదులుగా ఖరీదైన ప్రీమియం ఇంధనం వాడితే కారు ఇంజిన్ మరింత వేగంగా, పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందని అనుకుంటారు.
నిజం ఏంటంటే… కంపెనీ ప్రత్యేకంగా సిఫార్సు చేస్తే తప్ప, సాధారణ కార్లలో ప్రీమియం ఇంధనం వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మైలేజ్ పెరగదు, పనితీరు మారదు. కేవలం మన జేబుకు ఎక్స్ట్రా ఖర్చు మాత్రమే మిగులుతుంది.
►ALSO READ | ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ పడుతుందా? అసలు ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది?
4. పెద్ద టైర్లు వేస్తే రోడ్డుపై
అపోహ ఏంటంటే… కారుకు వెడల్పుగా ఉండే పెద్ద టైర్లు వేస్తే రోడ్డుపై గ్రిప్ బాగా ఉంటుందని చాలామంది మారుస్తుంటారు.
నిజం ఏంటంటే… కొన్ని సందర్భాల్లో ఇది నిజమైనా, కారు కంపెనీ స్పెసిఫికేషన్లకు సరిపోకుండా ఇష్టం వచ్చిన పెద్ద టైర్లు వేస్తే నష్టమే ఎక్కువ. కారును హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది, మైలేజ్ పడిపోతుంది, స్పీడోమీటర్ రీడింగ్ కూడా తప్పుగా చూపించే అవకాశం ఉంది.
5. కొత్త కారుకు సర్వీసింగ్
అపోహ ఏంటంటే… ఇప్పుడే కొత్త కారు కొన్నాం కదా, కొన్ని నెలల వరకు ఎలాంటి సర్వీసింగ్ లేదా మెయింటెనెన్స్ చేయాల్సిన పనిలేదని వదిలేస్తుంటారు.
నిజం ఏంటంటే… కొత్త కారుకు మొదటి సర్వీసింగ్ చాలా ముఖ్యం. కారు తయారీలో లేదా అసెంబుల్లో చిన్నపాటి లోపాలు ఏమైనా ఉంటే మొదటి సర్వీస్‌లోనే టెక్నీషియన్లు గుర్తించి సెట్ చేస్తారు.
6. జంప్-స్టార్ట్ చేస్తే
అపోహ ఏంటంటే… బ్యాటరీ డౌన్ అయిన వేరే కారుకు మన కారు ద్వారా జంప్-స్టార్ట్ (బ్యాటరీ ఛార్జ్ ఇవ్వడం) చేస్తే, మన కారు ఎలక్ట్రానిక్ సిస్టమ్ దెబ్బతింటుందని భయపడతారు.
నిజం ఏంటంటే… పద్ధతి ప్రకారం సరైన విధానంలో జంప్-స్టార్ట్ చేస్తే మన కారు ఎలక్ట్రానిక్స్‌కు ఎలాంటి ప్రమాదమూ లేదా నష్టం జరగదు. అవసరంలో ఉన్న డ్రైవర్లకు ఇలా సహాయం చేయవచ్చు.
7. ఏసీ వాడితే ఎక్కువ పెట్రోల్
అపోహ ఏంటంటే.. కారులో ఏసీ ఆన్ చేస్తే ఇంజిన్‌పై భారంపడి ఇంధనం ఎక్కువ ఖర్చైపోతుందని చాలా మంది ఏసీ వేయడానికి వెనుకాడతారు.
నిజంఏంటంటే.. ఏసీ ఇంజిన్ నుండి కొంత శక్తిని తీసుకుంటుంది నిజమే, కానీ దాని వల్ల ఇంధన వినియోగం మనం ఊహించినంత ఎక్కువగా ఎం ఉండదు. ముఖ్యంగా హైవేలపై స్పీడ్ గా వెళ్తున్నప్పుడు కిటికీలు దించితే గాలి అడ్డువచ్చి (ఏరోడైనమిక్ డ్రాగ్) మరింత ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అంతకంటే ఏసీ వేసుకోవడమే బెటర్.