Reading Time: < 1 minute

లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్

Caption of Image.

తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా సహాయం చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

 నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ, వివిధ ప్రాంతాల్లో సేవలు అందించిన మావోయిస్టు కీలక నాయకురాలు కాకర్ల సమత అలియాస్ మాధవి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ  క్రమంలో   సీవీ ఆనంద్ మాట్లాడుతూ… సుమారు 40 ఏళ్ల పాటు నల్లమల, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అడవుల్లో మావోయిస్టుగా పనిచేసిన సమత లొంగిపోవడం చారిత్రాత్మక పరిణామమని  అన్నారు. ఇదే సమయంలో, మరో కీలక నేత ముప్పల లక్ష్మణ్ రావు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని, ఆయనతో పాటు ఆయన భార్య కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మాజీ మావోయిస్టులకు హెల్త్ కార్డులు అందజేశామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. లొంగిపోయిన సీనియర్ నేతలతో సమావేశమై వారి సమస్యలు, సూచనలను స్వీకరించామని, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.

పునరావాస పాలసీని అత్యంత సమర్థంగా అమలు చేస్తామని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సీనియర్ నేతలకు సూచించినట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావచ్చని, రాజకీయాల్లోకి కూడా రావొచ్చని ఆయన స్పష్టం చేశారు. వారిపై ఉన్న కేసుల అంశాన్ని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.