Reading Time: 2 minutes

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు.. ముందు ‘అగ్నిపరీక్ష’లో గెలవాల్సిందే!

Caption of Image.

బిగ్ బాస్ పై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రియాలిటీ షో వస్తుందంటే టీవీల ముందు వాలిపోతారు ప్రేక్షకులు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్  తెలుగు  కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.  పదో సీజన్ తో మరింత భారీగా, మరింత కొత్తగా, మరింత ఉత్కంఠగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది . ఇప్పటికే విడుదలైన తొలి ప్రోమోతోనే ‘బిగ్ బాస్ దశావతారం’ అంటూ మేకర్స్ భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈసారి గేమ్ ఎలా ఉండబోతోంది? ఎవరు కంటెస్టెంట్లుగా రాబోతున్నారు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

హద్దులు దాటి ప్రవర్తిస్తే..

ఈ పదో సీజన్ కు కూడా హోస్ట్ గా  నాగార్జున..  తన మార్క్ చూపించబోతున్నారు. అయితే ఈసారి ఆయన ఓ విషయంలో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారట. హౌస్‌లోకి వెళ్లే ముందు కంటెస్టెంట్ల లిస్ట్‌ను చూడకూడదని నిర్ణయించుకున్నారట. కంటెస్టెంట్లను ముందే తెలుసుకుంటే తొలి పరిచయంలో సహజత్వం పోతుందని, అందుకే ప్రతి ఒక్కరినీ హౌస్‌లోనే తొలిసారి కలవాలనుకుంటున్నానని నాగార్జున చెప్పినట్లు సమాచారం. అంతేకాదు.. హౌస్‌లో హద్దులు దాటి ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.

 

ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే..

బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాలంటే ముందుగా ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ను దాటాల్సిందే.   ఈసారి కూడా గత సీజన్ లాగే సామాన్యులకు కూడా అవకాశం కల్పించబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 15 రోజుల డిజిటల్ ప్రీ-షోను నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నుంచి స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో ఈ ‘అగ్నిపరీక్ష’ ప్రారంభం కానుంది.  సుమారు 15 మంది షార్ట్‌లిస్ట్ చేసిన కంటెస్టెంట్లు ఇందులో పోటీ పడనున్నారు.  ఈసారి కేవలం కంటెస్టెంట్లు మారడం మాత్రమే కాదు.. గేమ్ రూల్స్‌నే మార్చేస్తున్నారని సమాచారం.

►ALSO READ | Indraputra: పురాణ ప్రపంచంలోకి కిరణ్ అబ్బవరం.. ‘ఇంద్రపుత్ర’తో మైథలాజికల్ యూనివర్స్!

 ‘అగ్నిపరీక్ష’కు హోస్ట్‌గా శ్రీముఖి 

అయితే ఇది సాధారణ పోటీ కాదు. శారీరక సామర్థ్యం, మానసిక బలం, సహనం, తెలివితేటలు, వ్యక్తిత్వం, పట్టుదల.. ఇలా ప్రతి కోణంలోనూ పరీక్షించబోతున్నారు. చివరి వరకు నిలబడిన వారికి మాత్రమే బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ దక్కనుంది. ఈ అగ్నిపరీక్షకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు నవదీప్, బిందు మాధవి, అభిజీత్ మెంటర్లు, జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 6న బిగ్ బాస్  లాంచ్..

సెప్టెంబర్ 6న బిగ్ బాస్ 10 గ్రాండ్ ప్రీమియర్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ ఎపిసోడ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఈసారి దాదాపు 15 వారాల పాటు గేమ్ సాగనుందని తెలుస్తోంది. మొత్తానికి.. ఈసారి బిగ్ బాస్ ఇంటి తలుపులు అందరికీ తెరిచి ఉన్నా.. ఆ తలుపులు దాటాలంటే మాత్రం ముందుగా అగ్నిపరీక్షలో గెలవాల్సిందే.  మరి ఆ పరీక్షలో ఎవరు నిలుస్తారు? ఎవరు ఒత్తిడికి తలొగ్గుతారు? ఎవరి వ్యక్తిత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? చివరకు బిగ్ బాస్ దశావతారంలోకి అడుగుపెట్టే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.

 

©️ VIL Media Pvt Ltd.