
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు చేస్తోన్న నిరసనలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలోని అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తోన్న విద్యార్థులపై లాఠీచార్జ్ వంటి బలప్రయోగ చర్యలు తప్పని పేర్కొన్నారు.
విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను విని పరిష్కరించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. జార్ఖండ్ విద్యార్థుల నిరసనపై రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ విమర్శిస్తోన్న వేళ.. తాజాగా ఆయన ఇష్యూపై రియాక్ట్ అయ్యారు.
►ALSO READ | షేక్ హసీనా అప్పగింతపై భారత్, బంగ్లాదేశ్ మధ్య చర్చలు..!
కాగా, ఇటీవల జార్ఖండ్లో జరిగిన JPSC, CGL పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన బాట పట్టారు. పరీక్షలను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పేపర్ లీకేజీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిపించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీకి నిరసనగా ఆగస్ట్ 10న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.
జాతీయజెండా, ప్లకార్డులతో కదం తొక్కిన విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బారికేడ్లు, పోలీసుల రక్షణ వలయాన్ని చేధించుకుని అసెంబ్లీ ప్రాంగంణంలోకి విద్యార్థులు దూసుకెళ్లారు. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగంణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.