
ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఊహించని అవాంతరం ఎదురైంది. విమానం నడపాల్సిన పైలట్ సమయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో 175 మందికి పైగా ప్రయాణికులు దాదాపు గంటసేపు విమానంలోనే వేచి చూడాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతోనే పైలట్ ఆలస్యంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగోకి చెందిన విమానం శుక్రవారం రాత్రి 8:20 గంటలకు ఢిల్లీలోని టెర్మినల్ 1 నుంచి టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే పైలట్ రాకపోవడంతో ప్రయాణికులందరినీ విమానంలోనే కూర్చోబెట్టి చివరకు రాత్రి 9:09 గంటలకు బయలుదేరారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ హనుమాన్ బెనివాల్ ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. వాతావరణం, ట్రాఫిక్‌ను ఊహించి తాను ముందుగానే బయలుదేరి వచ్చానని, మరి పైలట్ ఎందుకు ముందే రాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రయాణికులు ఆలస్యంగా వస్తే విమానం గంటపాటు ఆపుతారా? అని సోషల్ మీడియా వేదికగా విమానయాన సంస్థను నిలదీశారు. బాధ్యులైన ఇండిగోపై చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు. చివరకు వేరొక ఇండిగో విమానం ఢిల్లీకి చేరుకోవడంతో, ఆ విమాన పైలట్‌ను పంపి ఈ విమానాన్ని నడిపించినట్లు బెనివాల్ తెలిపారు. ఈ వివాదంపై స్పందించిన ఇండిగో యాజమాన్యం.. నగరంలో కురిసిన భారీ వర్షాలు, ట్రాఫిక్ అంతరాయాల వల్లే ఈ ఊహించని జాప్యం జరిగిందని వివరణ ఇచ్చింది. ప్రయాణికులకు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సమాచారం అందించామని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు!
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?