
సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం ఆయన పట్టుదలకు, శ్రమకు దక్కిన ప్రతిఫలం. “నేను జట్టుకు సరిపోకపోవచ్చు, కానీ నా ప్రయత్నంలో ఎలాంటి లోటు ఉంచను” అని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, అనుకూలించని పరిస్థితులను సైతం దాటుకొని తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా, ఇతర సిరీస్‌ల్లో సాయి సుదర్శన్ గాయపడటంతో, గత రెండేళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో స్థానం లభించింది.
ఈ పునరాగమనం కోసం సర్ఫరాజ్ తీవ్రంగా శ్రమించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు తగిన ఫిట్‌నెస్ సాధించేందుకు గత ఏడాదిన్నర కాలంలో ఏకంగా 17 కిలోల బరువు తగ్గారు. రంజీ ట్రోఫీలో త్రిశతకం సాధించినప్పటికీ శరీరాకృతి కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించి టీ20, టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ముంబైలో వర్షాల వల్ల ప్రాక్టీస్‌కు ఇబ్బంది కలగడంతో, కశ్మీర్‌లోని షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో గంటల తరబడి సాధన చేశారు.
2024లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జట్టు మొత్తం విఫలమైనప్పటికీ సర్ఫరాజ్‌పైనే వేటు పడింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో ‘ఇంట్రా-స్క్వాడ్’ మ్యాచ్‌లో సెంచరీ, ఇంగ్లాండ్ లయన్స్ పై 92 రన్స్ చేసినా ఎంపికదారులు అతడిని పక్కనబెట్టారు. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపినా సెలెక్టర్లు మొగ్గు చూపలేదు. అయితే ప్రస్తుతం సాయి సుదర్శన్ గాయం వల్ల రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్‌లతో పోలిస్తే స్ప్రిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం ఉండటంతో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కింది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధ్రువ్ జురెల్ ఇటీవల ఇబ్బంది పడుతుండటంతో, స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లలో ప్రావీణ్యం ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌కు శ్రీలంకలోని గాల్‌లో జరిగే మొదటి టెస్టులోనే తుది జట్టు (ప్లేయింగ్ XI)లో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదేమైనా ఎంతో శ్రమించి మళ్లీ టీమిండియాలోకి కమ్ బ్యాక్ ఇవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.