Reading Time: 2 minutes

E25 ప్లాన్ ఇప్పట్లో లేదు: E20పై రాజుకుంటున్న వివాదంతో కేంద్రం కీలక ప్రకటన

Caption of Image.

E20 పెట్రోల్ పై దేశ వ్యాప్త ఉద్యమానికి ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతాపార్టీ సిద్ధమవుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. E20 పైన E25, E30 ఫుయెల్ బ్లెండింగ్ కూడా ఉంటుందని గతంలో చేసిన ప్రకటనలతో.. ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని రాహుల్ గాంధీ  డిమాండ్ చేసిన సందర్భంగా.. కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో E20 ని  మించి వెళ్లే ఉద్దేశం లేదని రాజ్యసభలో 2026 ఆగస్టు 10న ప్రకటించింది. 

ఇప్పటికే ఈ20పై వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. కేంద్రం ఈ25 బ్లెండింగ్ కు కూడా వెళ్తుందా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని కేరళం ఎంపీ పీపీ సునీర్ రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ20 కారణంగా వాహనాల్లో సమస్యలు వస్తుండపై కూడా కేంద్రం స్పందించాల్సిందిగా అడిగారు. 

దీనికి సమాధానంగా.. మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేసే వరకు ఈ25 కి వెళ్లే ఆలోచన లేదని కేంద్రం చెప్పింది. మరిన్ని ప్రయోగాలు, వాహనతయారీ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు, రీసెర్చ్ సంస్థలతో మరిన్ని సంప్రదాయాల తర్వాతే దీనిపై ముందుకు వెళ్లనున్నట్లు బదులిచ్చారు. 

►ALSO READ | స్టూడెంట్స్‎పై దాడి తప్పు: జార్ఖండ్ విద్యార్థుల నిరసనలపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ

E20 పెట్రోల్ విషయంలో వస్తున్న ఆరోపణలపై కూడా కేంద్రం సమాధానం చెప్పింది. ఈ20 ఇప్పడిది కాదని.. నీతి ఆయోగ్, ఆటోమేకర్స్, ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) వంటి సంస్థల పర్యవేక్షణలో పరిశోధనలు, పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఈ20 బ్లెండింగ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇంజిన్ అరుగుదల, తుప్పు పట్టడం, స్టార్ట్ అయ్యే సామర్థ్యం, ఉద్గారాలు వంటి అంశాలపై తాము ల్యాబ్ టెస్టులతో పాటు , వాస్తవ  పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.

ఈ20 పై వస్తున్న ఆరోపణలను కేంద్రం కొట్టివేసింది. 20 కోట్ల బైక్స్, 3 కోట్ల పెట్రోల్ కార్లు ఈ బ్లెండెడ్ ఫుయెల్ వినియోగించాయని.. ఎక్కడా ఇంజిన్ ఫెయిల్యూర్ అనే సమస్య రాలేదని తెలిపారు. 

E20తో నడిచే కార్లకు కూడా కంపెనీలు ఇప్పటికీ వారంటీలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంధనం భద్రతపై విశ్వాసానికి ఇది సంకేతం అని అన్నారు.  ప్రభుత్వం ప్రకారం, అసాధారణ తుప్పు పట్టడం లేదా వాహనం మైలేజీ, లైఫ్ టైమ్ తగ్గడం వంటివి ఏవీ లేవని పేర్కొంది. 

అయితే, వాహనదారుల ఆందోళనలను  పాక్షికంగా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. E10  కోసం రూపొందించిన పాత వాహనాల్లో E20 వాడకం వల్ల మైలేజీ3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ఒప్పుకుంది. దీనిని ప్రభుత్వం ఒక చిన్న సమస్యగా పేర్కొంది. మైలేజ్ కేవలం ఇథనాల్ వాడకం వల్లే కాకుండా, డ్రైవింగ్ అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, మెయింటెనెన్స్ వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.