
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన చేసిన విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర మంత్రి జేపీ నడ్డా తోసిపుచ్చారు. జంతర్ మంతర్ దగ్గర నిరసనకారులపై ఎలాంటి కాల్పులు జరగలేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై కాల్పులు జరిపారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలు, దేశాన్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడవడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదని.. అందుకే గత 15 రోజులుగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాడని ఆరోపించారు. రోజుకో మాట మారుస్తూ సభలో చర్చ జరగకుండా గందరగోళం సృష్టించడమే ఆయన లక్ష్యమని విమర్శించారు. మొదట నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.. అందుకు కేంద్రం అంగీకరించగానే ఆయన మాట మార్చి రామ మందిరం, జంతర్ మంతర్ అంశాన్ని లేవనెత్తారని అసహనం వ్యక్తం చేశారు.
సభ సజావుగా పనిచేయకుండా అడ్డుకోవడమే అతడి ఉద్దేశమని.. అందుకే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై కాల్పులు జరిపారంటూ తప్పుడు ఆరోపణలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఎలాంటి కాల్పులు జరగలేదు.. ఫైరింగ్ చేయమని ఎవరూ చెప్పలేదు.. ఇకనైనా రాహుల్ గాంధీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం మానుకోవాలని చురకలంటించారు. పార్లమెంటులో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని.. ప్రభుత్వ వైఖరి ఎప్పుడూ సరళంగానే ఉందని పేర్కొన్నారు.
►ALSO READ | E25 ప్లాన్ ఇప్పట్లో లేదు: E20పై రాజుకుంటున్న వివాదంతో కేంద్రం కీలక ప్రకటన
విపక్షాలు సభలో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. సభ సజావుగా నడిస్తే ప్రతి అంశంపై చర్చ, సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి మరోసారి సవాల్ విసురుతున్నా.. ప్రతిపక్షాల ప్రతి ప్రశ్నకు జవాబు లభిస్తుందని.. వారు సభకు రావాలన్నారు. కాగా, జంతర్ మంతర్ దగ్గర నిరసనకారులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పాలని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తోన్న వేళ అసలు కాల్పులే జరగలేదని నడ్డా పేర్కొనడం గమనార్హం.