Reading Time: < 1 minute

IPL 2026: చెన్నైకు మరో షాక్.. IPL నుంచి యంగ్ ఆల్‎రౌండర్ ఔట్

Caption of Image.

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మిడ్ సీజన్‎లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు యువ ఆల్ రౌండర్ రామకృష్ణ ఘోష్ టోర్నీలో మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు. 2026, మే 2న చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై జట్లు తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా యంగ్ ఆల్ రౌండర్ రామకృష్ణ ఘోష్ ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. డెబ్యూ మ్యాచులోనే ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు. 

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్ర్రమించాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ఆదివారం (మే 3) అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది. ‘‘చెపాక్‌లో జరిగిన CSK vs MI మ్యాచ్ సందర్భంగా రామకృష్ణ ఘోష్ కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. అతను IPL 2026లో ఇకపై పాల్గొనడు’’ అని వెల్లడించింది. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

ముంబై ఇండియన్స్‎తో జరిగిన మ్యాచ్‌లో ఘోష్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఈ ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులు ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశాడు. ఫీల్డింగ్ చేస్తుండగా విల్ జాక్స్ కొట్టిన బంతిని అందుకునేందుకు డైవ్ చేసి ఫాలో-త్రూలో అతను కిందపడిపోయాడు. దీంతో ఘోష్ కుడి కాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేవలం ఒకే మ్యాచ్ ఆడి టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. 

చెన్నైను వెంటాడుతోన్న గాయాల బెడద

ఈ సీజన్ ప్రారంభం నుంచే చెన్నై సూపర్ కింగ్స్‎ను గాయాల బెడద వెంటాడుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ టోర్నీ నుంచి తప్పుకోగా అతని స్థానంలో స్పెన్సర్ జాన్సన్ జట్టులోకి వచ్చాడు. స్పెన్సర్ జాన్సన్ కూడా గాయపడ్డాడు. ఆ తర్వాత స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. సూపర్ ఫామ్‏లో ఉన్న స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే కూడా గాయపడి టోర్నీకి దూరమయ్యాడు. మాత్రే స్థానంలో ఆకాష్ మధ్వాల్ ఎంపికయ్యాడు.

©️ VIL Media Pvt Ltd.