
గాంధీ నగర్: ఐపీఎల్ 2026 టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌కు గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. ఆదివారం (మే 3) నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ ఘన విజయం సాధించింది. సాయిసుదర్శన్ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. హోల్డర్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో పంజాబ్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
సూర్యాంశ్ షెడ్గే (57), స్టోయినిస్ (40) రాణించారు. పంజాబ్ విధించిన 164 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. వాషింగ్టన్ సుందర్ (40), బట్లర్ (26) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, వైశాఖ్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టోయినిస్, జాన్సన్ ఇద్దరూ ఒక్కో వికెట్ సాధించారు.
పంజాబ్‌ను ఆదుకున్న 23 ఏళ్ల కుర్రాడు
ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లలోనే ఇన్ఫామ్ బ్యాటర్స్ ప్రియాన్ష్ ఆర్య (2), కూపర్ కన్నోలి (0) వికెట్లు తీసి మహ్మద్ సిరాజ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. ప్రభ్ సిమ్రాన్ (15), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. నేహాల్ వధేరా డకౌటై తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ 40 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఈ దశలో జతకట్టిన యంగ్ ప్లేయర్ సూర్యాంశ్ షెడ్గే (57), స్టోయినిస్ (40) ఆరో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పంజాబ్‌ను ఆదుకున్నారు. ముఖ్యంగా సూర్యాంశ్ షెడ్జ్ భారీ షాట్లతో అలరించాడు. మానవ్ సుతార్ వేసిన 14వ ఓవర్లో మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాది 24 పరుగులు పిండుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో సూర్యాంశ్ షెడ్జ్, స్టోయినిస్ ఔట్ అయ్యారు. చివర్లో మార్కో జాన్సెన్ (20) రాణిచండంతో పంజాబ్ 160 రన్స్ మార్క్ అందుకుంది. గుజరాత్ బౌలర్లలో హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు. రబాడ, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
సుందర్ సూపర్ ఇన్నింగ్స్
పంజాబ్ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.5 ఓవర్లలో చేధించింది. స్టోయినిస్ వేసిన చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా అర్షద్ ఖాన్ ఓ ఫోర్ కొట్టి సింగల్ తీశాడు. ఐదో బంతికి భారీ సిక్సర్ బాది మ్యాచ్ గెలిపించాడు వాషింగ్టన్ సుందర్ (40). కీలకమైన సమయంలో బాధ్యతాయుతంగా ఆడి గుజరాత్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు సుందర్. ఓపెనర్ సాయిసుదర్శన్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. జోస్ బట్లర్ (26) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ శుభమన్ గిల్ (5) విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, వైశాఖ్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టోయినిస్, జాన్సన్ ఇద్దరూ ఒక్కో వికెట్ సాధించారు.