
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బోథ్ మండలం కన్గుట్ట గ్రామంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలకు చేతికొచ్చిన మొక్క జొన్న పంటా కాలి బూడిదైపోయింది. ఒక చేనులో మొదలైన మంటలు చూస్తుండగానే పక్కనే ఉన్న ఇతర పొలాలకు శరవేగంగా విస్తరించాయి. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు సుమారు వంద ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్గిపాలైంది. కళ్లముందే చేతికొచ్చిన పంట బూడిదవుతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కన్గుట్ట నుండి మంటలు పొరుగునే ఉన్న బోథ్, సాకెరా గ్రామ శివార్లకు వేగంగా వ్యాపిస్తున్నాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి, స్థానికులకు కష్టతరంగా మారింది.
వేల రూపాయల పెట్టుబడి పెట్టి, రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంట కళ్ల ముందే బుగ్గిపాలవుతుండటంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మంటలు మరింత విస్తరించకముందే అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.