Reading Time: 2 minutes

మారిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం.. కళ్లుచెదిరే ధరకు కొనుగోలు చేసిన మిట్టల్ ఫ్యామిలీ

Caption of Image.

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫస్ట్ సీజన్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్.మిట్టల్ కుటుంబంతో పాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. 1.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15,600 కోట్లు) భారీ ధరకు ఆర్ఆర్‎లో మెజార్టీ వాటాను దక్కించుకున్నారు. ఈ మేరకు మిట్టల్ ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసింది. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు మిట్టల్ ఫ్యామిలీ ప్రకటించింది. 

మొదట రాజస్థాన్ రాయల్స్‎ను కొనేందుకు అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్లకు బిడ్ దాఖలు చేసింది. కానీ వివిధ కారణాలతో ఈ ఒప్పందం కుదరలేదు. చివరకు పోటీ నుంచి కల్ సోమానీ కన్సార్టియం తప్పుకోవడంతో అదర్ పునవాలాతో కలిసి మిట్టల్ ఫ్యామిలీ 1.65 బిలియన్ డాలర్ల భారీ ధరకు ఆర్ఆర్‎ను చేజిక్కించుకుంది. 

ఈ డీల్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ జట్టులో మిట్టల్ కుటుంబం 75 శాతం మెజార్టీ వాటాను కలిగి ఉండగా.. పూనావాలాకు సుమారు 18 శాతం వాటా కలిగి ఉంటారు. మిగిలిన 7 శాతం వాటా మనోజ్ బదాలేతో సహా ఆమోదం పొందిన ప్రస్తుత పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. రూ.15,700 కోట్ల ఈ భారీ ఒప్పందంలో ఐపీఎల్‎లో రాజస్థాన్ రాయల్స్ పురుషుల ఫ్రాంచైజీతో పాటు పార్ల్ రాయల్స్ (దక్షిణాఫ్రికా లీగ్), బార్బడోస్ రాయల్స్ (కరేబియన్ లీగ్) జట్లు కూడా భాగమేనని మిట్టల్ ఫ్యామిలీ స్పష్టం చేసింది.

ఇటీవలే ఐపీఎల్ అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా చేతులు మారిన విషయం తెలిసిందే. యూకేకు చెందిన డియాజియో గ్రూప్ నుంచి 1.78 బిలియన్ డాలర్లు (రూ.16,660 – రూ.16,700 కోట్లు)కు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ కన్సార్టియం కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆ తర్వాత 1.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15,600 కోట్లు)కు అమ్ముడైన రాజస్థాన్ ఆర్సీబీ తర్వాత అత్యంత విలువైన జట్టుగా నిలిచింది. 
 

©️ VIL Media Pvt Ltd.