Reading Time: < 1 minute

తెలంగాణలో పలుజిల్లాల్లో గాలివాన బీభత్సం.. తడిసిన ధాన్యం..అన్నదాత ఆగమాగం

Caption of Image.

పొద్దున్నుంచి నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణలో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆదివారం (మే3) రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. మరికొన్ని చోట్ల ఈదురు గాలులు బీభ్సత్సం సృష్టించాయి. దీంతో చాలా చోట్ల ఐకేపీ కేంద్రాలు, వ్యవసాయ బావుల దగ్గర కల్లాల్లో వర్షానికి  పంట కొట్టుకుపోవడం రైతన్నలకు తీరని నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే..  

సిద్దిపేటలో మార్కెట్ యార్డులో తడిసి ముద్దయిన ధాన్యం 

సిద్దిపేట జిల్లాలో వడగండ్ల బీభత్సం సృష్టించింది. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. కేవలం పదిహేను నిమిషాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో మార్కెట్లో  ఉన్న ధాన్యం, మొక్కజొన్న పంట నీటి పాలైంది. భారీగా వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో ఆరబోసిన దాదాపు ధాన్యం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. కళ్లముందే పంట నీటి పాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం.. 

మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి మొక్కజొన్న కంకులు కొట్టుకుపోయాయి. జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. బయ్యారం మండలంలో ఏజెన్సీ గ్రామాల్లో ఉరుములు, ఈదురు గాలులు వీచాయి. నారాయణపురంలో ఈదురుగాలులుకు చెట్లు కూలిపోయాయి.  

నల్లగొండ జిల్లాలో.. 

నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది.  ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో తీరని నష్టం జరుగుతుందని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.