
హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బతుకు దెరువు కోసం వచ్చిన ఓ ఫ్యామిలీ గత రెండు ఏళ్లుగా రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌లోని న్యూ మారుతి నగర్‌లో నివాసం ఉంటోంది. వారి కుమార్తె కీర్తి (21) గండిపేటలోని MGIT కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలాగే ఈరోజు కూడా కాలేజీకి వెళ్లిన కీర్తి.. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ ఇంట్లో ఉన్న డీజిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ దారుణ ఘటనలో కీర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న వెంటనే మీర్ పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి అన్న నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
►ALSO READ | నేరేడ్ మెట్ కేసులో షాకింగ్..స్నేహితుడిని చంపేసి..కిచెన్ లో పూడ్చి గోడ కట్టేశాడు
చదువుకుని ఉన్నత స్థాయికి చేరుతుందనుకున్న బిడ్డ.. ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు కీర్తి ఆత్మహత్యకు గల కారణాలేంటి? చదువులో ఒత్తిడా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.