
ముంబై: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) కీలక పోరు జరగనుంది. లీగ్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్, వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా ఈ రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.
గెలుపు జోష్‌లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబైపై విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలని భావిస్తోంది. మరోవైపు లీగ్‌లో వరుస పరాజయాలు చవిచూసిన ముంబైకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిదే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
హైదరాబాద్‌పై ఓడితే పాండ్యా సేన ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. లీగ్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ముంబై కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఐదింట్లో ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి.
దాంతో ముంబై ఇండియన్స్ నెక్ట్స్ ఆడబోయే 7 మ్యాచ్‌లకు ఏడు గెలవాల్సిన పరిస్థితి. కనీసం 6 మ్యాచ్‌లైనా గెలిస్తేనే పాండ్య సేకు టాప్-4 బెర్త్ ఖరారు అవుతుంది. లేదంటే ఈ సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ దశలోనే ఇంటిబాట పట్టనుంది. ఈ నేపథ్యంలో చావోరేవో లాంటి మ్యాచులో సొంతగడ్డపై హైదరాబాద్‌ను ముంబై ఏ మేరకు కట్టడి చేస్తుందో చూడాలి. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ హైదరాబాద్‌తో మ్యాచుకు రీ ఎంట్రీ ఇవ్వనుండటం ముంబైకు సానూకూలంశం.