
ముంబై: భార్య బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రియుడి మోజులో కొందరు.. ఇతర కారణాలతో మరికొందరు భర్తలను అడ్డు తొలగించుకుంటున్నారు. హనీమూన్ పేరుతో ఒకరు.. తినే తిండిలో విషం కలిసి ఇంకొకరు ఇలా క్రూరంగా భర్తలను అంతమొందిస్తున్నారు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే క్రూరత్వానికి అంతే లేదా అనిపించక మానదు. తాజాగా మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్తకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోనే సజీవంగా పాతిపెట్టటానికి ప్లాన్ చేసిందో భార్యామణి. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ కావడంతో జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రవీణ్ జగతాప్, షర్మిలా ప్రవీణ్ జగతాప్ భార్యభర్తలు. మహారాష్ట్ర బారామతిలోని జామ్దార్ రోడ్డులో ఉన్న ఇంద్రప్రస్థ సొసైటీలో నివాసం ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది షర్మిలా. ఇందులో భాగంగానే ఆగస్ట్ 1వ తేదీన భర్తకు మత్తు మందు ఇచ్చింది. భర్త మత్తులోకి జారుకున్నాక బ్యాట్‌తో అతడిపై దాడి చేసింది. అనంతరం భర్తను ఇంట్లోనే సజీవంగా పాతిపెట్టాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం ఇంట్లో గోతి తవ్వేందుకు కొందరు కూలీలను పిలిపించింది.
►ALSO READ | అండర్‌కవర్ ఏజెంట్ అంటూ బిల్డప్.. ఐదు ఐఫోన్లు, టెస్లా కారుతో దొరికిపోయిన నకిలీ ఐఏఎస్ !
అయితే, సదరు మహిళా ప్రవర్తనపై అనుమానం వచ్చిన కూలీలు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫ్లాట్‌కు చేరుకుని ప్రవీణ్‌ను రక్షించారు. చికిత్స కోసం అతడిని బారామతిలోని గిరిరాజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. షర్మిలా తన భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యభర్తల మధ్య గొడవా లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో కూపీ లాగుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.