Reading Time: < 1 minute

బొగ్గును బంగారంగా మారుస్తామంటూ నమ్మించి..శంషాబాద్ లో  కోటి వసూలు చేసిన కేటుగాళ్లు

Caption of Image.

ఇళ్ల కింద గుప్త నిధులున్నాయ్.. తవ్విస్తే కోట్లకు కోట్లు మీ సొంతమవుతాయి.  నమ్మకం లేకపోతే ప్రత్యేక పూజలు చేసి బొగ్గును కూడా బంగారంగా మార్చి చూపిస్తాం.  అంటూ అమాయకులను నమ్మించి, కోట్లకు కోట్లు కొల్లగొట్టిన ఒక ఘరానా  ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.

హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళితే.. నలుగురు సభ్యులున్న ఒక కేటుగాళ్ల ముఠా కొద్దికాలంగా అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ వస్తోంది. తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, ఇళ్ల కింద గుప్త నిధులు దాగున్నాయని బాధితులను నమ్మించేవారు. పక్కా ప్లాన్‌తో ముందుగానే బాధితుల ఇళ్లల్లోని గుంతల్లో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను రహస్యంగా ఉంచేవారు. ఆ తర్వాత అక్కడ పూజలు నిర్వహించి.. ప్రత్యేక శక్తులతో బొగ్గు బంగారంగా మారిపోయిందంటూ నమ్మించి ఘరానా మోసాలకు పాల్పడేవారు.

ఈ విధంగా సుమారు 11 మందిని నమ్మించి, వారి నుంచి ఏకంగా కోటి రూపాయల వరకు వసూలు చేశారు ఈ కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పక్కా సమాచారంతో ఈ మోసపు ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ALSO READ : గూగుల్ డ్రైవ్ ఫోటో బ్యాకప్ సర్వీసులు బంద్..

ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్ మునావర్ పై ఇప్పటికే గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 25 నకిలీ బంగారు పూత పూసిన నాణేలతో పాటు, 6 కిలోల బొగ్గును, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

 

©️ VIL Media Pvt Ltd.