Reading Time: < 1 minute
Manchu Manoj Viral Comments Cinema Has No Caste Religion Gaja Teaser Launch

Manchu Manoj: ‘గజ’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా ఒకేసారి బాధ్యతలు తీసుకోవడం అంత సులభమైన విషయం కాదన్నారు. కొత్త టీమ్‌తో ఇలాంటి ప్రయత్నం చేయడానికి ధైర్యం చేసిన చిత్రబృందాన్ని అభినందించారు. ‘గజ’ టీజర్‌ చాలా బాగా వచ్చిందని, తాను నిజంగా ఇంప్రెస్ అయ్యానని మనోజ్ తెలిపారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవడంతో పాటు, దానిపై నమ్మకంతో కష్టపడాలని అన్నారు. ఈ సినిమా కోసం సతీష్ జై దర్శకుడు, హీరో, నిర్మాతగా పనిచేసిన తీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.

అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని కూడా మనోజ్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రి మోహన్‌బాబు నటించిన ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆయన సంగీతాన్ని దగ్గరుండి చూశానని చెప్పారు. ఇటీవల ఆయన అందించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా మంచి విజయాన్ని అందుకుందని, ‘గజ’తోనూ ఆ విజయ పరంపర కొనసాగాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమకు కులం, గోత్రం ఉండవని మంచు మనోజ్ అన్నారు. “కళామతల్లికి కులం లేదు.. మతం లేదు. సినిమా వాళ్లకు, ప్రేక్షకులకు, మీడియాకు మనందరిదీ ఒకటే కులం.. ప్రేమ కులం” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు. ‘గజ’ టీజర్‌ చూస్తుంటే సినిమా చాలా ప్రామిసింగ్‌గా అనిపించిందని, చిత్రబృందం మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.