Reading Time: < 1 minute

ఏటీఎంల దగర తస్మాత్ జాగ్రత్త..అమాయకులే వీళ్ల టార్గెట్

Caption of Image.

హైదరాబాద్‌లో (ఏటీఎం) ATM కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న భారీ మోసాలకు ఖైరతాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. అమాయకులను నమ్మించి నకిలీ లావాదేవీలతో బురిడీ కొట్టిస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి  మీడియాకు వెల్లడించారు.నిందితుడు అత్యంత తెలివిగా ఏటీఎం దగ్గరకు వచ్చే అమాయకులను టార్గెట్  చేశాడు.. ముఖ్యంగా డబ్బు డిపాజిట్ చేయడానికి ఇబ్బంది పడేవారిని గమనించి, వారికి సాయం చేస్తానని నమ్మబలికేవాడు. బాధితుల నుంచి నగదు తీసుకుని, తన మొబైల్ ద్వారా వారికి నకిలీ NEFT ట్రాన్సాక్షన్ మెసేజ్‌లు చూపించి నగదు దోపిడీకి పాల్పడేవాడు. ఆ మెసేజ్ నిజమేనని నమ్మిన బాధితులు అక్కడి నుంచి వెళ్ళిపోగానే నిందితుడు పరారయ్యేవాడు.

ఇటీవల సుల్తాన్ బజార్‌లో ఒక మహిళను ఇదే తరహాలో నమ్మించి, ఏకంగా లక్ష రూపాయలు కాజేశాడు.ఈ నిందితుడు. 2018 నుంచి 2025 వరకు ఇతనిపై ఏకంగా 73 కేసులు నమోదై ఉన్నాయి.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఖైరతాబాద్ పోలీసులు, CCTV ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 2.40 లక్షల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేయడంతో పాటు, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి  ప్రజలకు కీలక సూచనలు చేశారు. ATMల వద్ద అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని, నగదు విషయంలో ఇతరుల సహాయం తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
 

©️ VIL Media Pvt Ltd.