Reading Time: 2 minutes

వేసవి విందుగా సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’.. పల్లెటూరి ప్రేమలో తడిసిముద్దవ్వాల్సిందే!

Caption of Image.

షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో యూత్ ఐకాన్‌గా ఎదిగి, ‘మేమ్ ఫేమస్’ సినిమాతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన యంగ్ హీరో సుమంత్ ప్రభాస్. ఇప్పుడు పల్లెటూరి నేపథ్యం ఉన్న స్వచ్ఛమైన ప్రేమకథ ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ఈ చిత్రం మే 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

కథా నేపథ్యం..

లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. సినిమా మొత్తం ఆహ్లాదకరమైన గోదావరి పరిసరాల్లో సాగే ఎమోషనల్ రైడ్‌లా అనిపిస్తోంది. ఇందులో సుమంత్ ప్రభాస్ ‘రాజు’ అనే అమాయకమైన, సరదాగా ఉండే ఆటో డ్రైవర్‌గా కనిపించగా, నిధి ప్రదీప్ ‘మాయ’ అనే కాలేజీ విద్యార్థినిగా నటించింది. ప్రతిరోజూ రాజు ఆటోలోనే మాయ కాలేజీకి వెళ్లడం, ఆ క్రమంలో వారి మధ్య చిగురించిన మౌన రాగం ప్రేమగా మారడం చాలా సహజంగా చూపించారు. పల్లెటూరి కుర్రాడిగా సుమంత్ ప్రభాస్ నటన, బాడీ లాంగ్వేజ్ యువతను కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..

జగపతి బాబు ఎంట్రీతో మలుపు!

ప్రేమ వరకు అంతా సాఫీగా సాగిపోయినా, వారి బంధానికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. మాయ తండ్రిగా వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ పాత్రలో కనిపించారు. కూతురుపై విపరీతమైన ప్రేమ ఉన్న కఠినమైన తండ్రిగా ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తన ప్రేమను గెలవాలంటే, ఆ తండ్రి నమ్మకాన్ని రాజు ఎలా గెలుచుకున్నాడు? వారి మధ్య సాగే భావోద్వేగ పోరాటం ఏంటి? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.

దర్శకుడు సుభాష్ చంద్ర గతంలో షార్ట్ ఫిలిమ్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు, ఇప్పుడు ఈ సినిమాతో వెండితెరపై తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో సీనియర్ నటి లైలా, కమెడియన్స్ సుదర్శన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వైవా రాఘవ ఇతర కీలక పాత్రల్లో నటించి వినోదాన్ని పంచనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సానుకూల స్పందనను రాబట్టగా, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ లవ్ స్టోరీగా వస్తున్న ‘గోదారి గట్టుపైన’, మే 8న వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ‘మేమ్ ఫేమస్’ తర్వాత సుమంత్ ప్రభాస్ మరో హిట్ కొడతారో లేదో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.