
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మను బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
బెంగాల్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ చోట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరొందిన అజయ్ పాల్ శర్మను ఈసీ పోల్ అబ్జర్వర్‌గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, కోల్‌కతాతో సహా దక్షిణ బెంగాల్ వ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది.
ఎవరీ అజయ్ పాల్ శర్మ..?
పంజాబ్‌లోని లూథియానాకు చెందిన అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్ ఐపీఎస్-2011 బ్యాచ్‌కు చెందిన అధికారి. పోలీసు శాఖలో అత్యంత సమర్ధుడైన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. యూపీలోని షామ్లీ, నోయిడా, గౌతమ్ బుద్ధ నగర్ వంటి ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేసిన కాలంలో అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లలో పాల్గొనడంతో ఆయనకు యూపీ సింగం, యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. అజయ్ పాల్ శర్మ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జాయింట్ పోలీస్ కమిషనర్ (అదనపు పోలీస్ కమిషనర్)గా పనిచేస్తున్నారు.
బెంగాల్‌లో విస్తృత భద్రతా ఏర్పాట్లు
ఏప్రిల్ 29న జరగనున్న రెండో దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. మరోవైపు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించారు. రాజధాని కోల్‌కతాలో అత్యధికంగా 273 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.