Reading Time: 2 minutes

ఇరాన్ కంట్రోల్‎లోనే హార్మూజ్.. ట్రంప్ ప్రకటనను కొట్టిపారేసిన IRGC

Caption of Image.

టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్ మా నియంత్రణలో ఉందంటే.. లేదు మా కంట్రోల్‎లో ఉందని ఇరుదేశాలు పోటా పోటీ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హార్మూజ్ అమెరికా నియంత్రణలో ఉందన్న యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్మూజ్ జలసంధి తమ కంట్రోల్‎లోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. 

ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పారామిలిటరీ బసిజ్ దళాధిపతి హొస్సేన్ తాయెబ్ మాట్లాడుతూ.. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. అమెరికా దళాల ఆధీనంలో ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలు అవాస్తమని పేర్కొన్నారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కూడా హార్మూజ్ జలసంధిపై ట్రంప్ వాదనలను నిర్ద్వందంగా ఖండించారు. హార్మూజ్ ముమ్మాటికీ ఇరాన్ నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. ఇంటలిజెన్స్ వైఫల్యాల కారణంగా ఇటీవల అమెరికా ఇలాంటి తప్పుడు అంచనాలు వేస్తోందని ఎద్దేవా చేశారు. 

హార్మూ్జ్ జలసంధిలో కేవలం ఇజ్రాయెల్, అమెరికా, దాని మిత్రదేశాల నౌకలపై మాత్రమే ఆంక్షలు విధించినట్లు తెలిపారు. యుద్ధ సమయంలో అయినా.. శాంతి సమయంలో అయినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ జియోనిస్ట్ పాలనకు చెందిన నౌకలకు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళే హక్కు ఉండదని తేల్చిచెప్పారు. 

అమెరికా కంట్రోల్‎లో హార్మూజ్: ట్రంప్

హార్మూజ్ జలసంధి మొత్తం తమ నియంత్రణలోకి వచ్చిందని, దానిని అలాగే కంట్రోల్‎లో ఉంచుకుంటామని భావిస్తున్నానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‎పై అమెరికా నావికాదళ దిగ్బంధం విజయవంతమైందని ప్రశంసించారు. దీనిని అందరూ ‘ఉక్కు గోడ(వాల్ ఆఫ్ స్టీల్)’ అని కొనియాడుతున్నారని, ఇరాన్ ఏమీ చేయలేదన్నారు. 

తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ మేరకు పోస్ట్ పెట్టారు. “ఇరాన్‎కు ఇక నావికాదళం, వైమానిక దళం లేవు. వారి సైనికులకు జీతాలు కూడా అందడం లేదు. ఐఆర్జీసీ పూర్తిగా దెబ్బతిని పారిపోతోంది. ఇరాన్ ఇకపై పశ్చిమాసియాలో ఇతర దేశాలను బెదిరించలేదు. అల్లాకు స్తోత్రం!” అంటూ ఆయన తన పోస్టును ముగించారు.

కాగా, అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హార్మూజ్ మూసివేత అమెరికన్ ఓటర్లకు ధరలను పెంచేలా చేసిందని, ఇది ట్రంప్‎కు రాజకీయ తలనొప్పిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఆదివారం ‘యాక్సియోస్’ మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్‎తో తక్కువ స్థాయి చర్చలు మాత్రమే జరుపుతున్నామని చెప్పారు. “ఇరాన్‎లో విపరీతమైన ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద అసలు డబ్బు లేదనే వాస్తవాన్ని మేం గమనిస్తున్నాం. సమస్య సర్దుబాటు అవుతుంది. ఇది చెస్ ఆట లాంటిది” అని ఆయన అభివర్ణించారు.
 

©️ VIL Media Pvt Ltd.